మిగిలింది నాలుగు రోజులే..
ఫ ఇంటర్ పరీక్ష ఫీజుకు సమీపిస్తున్న
తుది గడువు
ఫ అపరాధ రుసుం లేకుండా
ఈ నెల 5 తేదీ ఆఖరు
రాయవరం: వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్స్ విడుదలయ్యాయి. అపరాధ రుసుం లేకుండా పదో తరగతి పరీక్ష ఫీజు తుది గడువు ఇప్పటికే ముగియగా, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 5వ తేదీ వరకూ కట్టొచ్చు. 2024 మార్చిలో జరగనున్న ఇంటర్ పరీక్షలకు పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ను అక్టోబర్ 17న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృత్తికా శుక్లా విడుదల చేశారు. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు నవంబరు 11వ తేదీ వరకూ తొలుత గడువు విధించింది. తర్వాత రెండో సారి నవంబర్ 21వ తేదీ వరకూ గడువు పొడిగించింది. మూడో సారి ఈ నెల 5వ తేదీ వరకూ గడువు విధిస్తూ ఇంటర్ బోర్డు అవకాశాన్ని కల్పించింది. దీనికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో విద్యార్థులు అప్రమత్తం కావాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత జాప్యమయ్యే కొద్దీ అపరాధ రుసుం మోత మోగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంత వీలైతే అంత త్వరగా పరీక్ష ఫీజును చెల్లిస్తే మంచిదన్న అభిప్రాయం జూనియర్ కళాశాలల వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఫీజుల చెల్లింపు ఇలా..
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్ష నిమిత్తం రూ.600 చెల్లించాల్సి ఉంది. జనరల్ కోర్సులు చదివే సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్ (సెకండియర్ విద్యార్థులు మాత్రం) రూ.275 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు చదువుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు పరీక్ష రుసుంగా రూ.165 కట్టాలి. సెకండియర్ చదువుతూ ఫస్టియర్ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు మొదటి, రెండో సంవత్సరాల థియరీ ఫీజు కలిపి రూ.1,200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు చదువుతూ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 కట్టాలి. బ్రిడ్జి కోర్సు చదివే విద్యార్థులు రెండేళ్లు పరీక్షలకు రూ.330 చెల్లించాలి. ఫస్టియర్, సెకండియర్ పాసై ఉండి, మార్కులు ఇంప్రూవ్‌మెంట్‌కు పరీక్ష రాసే ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350 చొప్పున, సైన్స్ విద్యార్థులు రూ.1,600 చొప్పున చెల్లించాలి.
కాకినాడ జిల్లాలో..
జిల్లాలో 45,323 మంది ఇంటర్ విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 23,568 మంది ఉండగా, ఇప్పటి వరకూ 22,584 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. సెకండియర్ విద్యార్థులు 21,755 మందికి 19,208 మంది ఫీజు చెల్లించారు. జిల్లాలో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు మొత్తం 3,531 మంది పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంది.
గడువులోగా చెల్లించాలి
పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించే విధంగా విద్యార్థులను చైతన్యం చేయాలని సూచించాం. గడువు ముగిసేలా చెల్లిస్తే ఇబ్బంది ఉండదు.
–వనుము సోమశేఖరరావు,
జిల్లా ఇంటర్ బోర్డు విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment