సర్కారు చోద్యం | - | Sakshi
Sakshi News home page

సర్కారు చోద్యం

Published Tue, Dec 3 2024 12:05 AM | Last Updated on Tue, Dec 3 2024 12:05 AM

సర్కా

సర్కారు చోద్యం

ఖరీఫ్‌లో సాగైన భూమి: 2.14 లక్షల ఎకరాలు

దిగుబడి లక్ష్యం: ఐదు లక్షల మెట్రిక్‌ టన్నులు

పూర్తయిన వరి కోతలుః 1,40,000 ఎకరాలు

కళ్లాల్లో ఉన్న ధాన్యం: 85 వేలమెట్రిక్‌ టన్నులు

కొనుగోలు కేంద్రాలు: 277

ప్రభుత్వం కొన్న ధాన్యం ః 90 వేల మెట్రిక్‌ టన్నులు

కనీస మద్దతు ధర 75 కేజీలు: రూ.1,725

వాస్తవంగా రైతుకు దక్కుతున్న ధర: 1,400

తేమ పేరుతో ఖరీఫ్‌ పంట దోపిడీ

ప్రతి బస్తాకు రూ.200 నష్టం

మద్దతు ధరకు కొనుగోలు వట్టిమాటే

ప్రభుత్వ జాప్యం రైతులకు శాపం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: శ్రీనేతి బీరకాయలో నెయ్యిశ్రీ చందంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కనిపిస్తోంది. కనీస మద్దతు ప్రకటనలకే పరిమితమైంది. రైతు భరోసా కేంద్రానికి ఫోన్‌కాల్‌ చేస్తే చాలు సిబ్బంది కళ్లాల్లో శాంపిల్స్‌ తీసుకుని, పట్టుబడి చేసి, మిల్లుకు చేరవేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని చెప్పిన మాటలు నీటిమీద రాతలుగా మిగిలాయి. ధాన్యం కొనుగోలులో అడుగడుగునా దళారీల ప్రమేయంతో రైతులు దోపిడీకి గురవుతున్నారు. తేమ 17శాతం ఉంటేనే అనుమతిస్తున్నారు. ఆపైన 22 శాతం వరకు కేజీ నుంచి ఐదు కేజీల వరకు ధాన్యం కోత పెడుతున్నారు. ఫలితంగా రైతు రూ.150 నష్ట పోతున్నాడు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో తేమ 30 శాతం వరకు కూడా అనుమతించి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. ఇప్పుడది ఎక్కడా కనిపించడం లేదని రైతులు మండిపడుతున్నారు.

పెరిగిన పెట్టుబడి... తరిగిన దిగుబడి

ఖరీఫ్‌ రైతు రెక్కల కష్టం దళారుల పరమవుతోంది. తుపాను ఫలితంగా వచ్చిపడ్డ వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కళ్లాల్లోనే అయిన కాడికి అమ్మేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో సర్కారుకు ముందుచూపు లేకపోవడం రైతులకు శాపంగా పరిణమించింది. అధిక వర్షాలు, వరదలతో పెట్టుబడులు తడిసిమోపైడె ఈసారి ఖరీఫ్‌ సాగు రైతులకు పెను భారమైంది. పెరిగిన పెట్టుబడికి తగ్గట్టు ధాన్యం దిగుబడులు వచ్చాయా అంటే అదీ లేదు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన వర్షాలు, వరదలతో దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు కనీసం 40 బస్తాలు దిగుబడి ఖాయమని రైతులు పెట్టుకున్న ఆశలు వాతావరణ ప్రభావంతో అడియాసలయ్యాయి. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గినా కనీసం ధర విషయంలో మంచి జరుగుతుందని ఎదురుచూసిన రైతులకు అక్కడా చుక్కెదురైంది. ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వం హడావుడి చేసింది తప్పితే రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేయలేకపోయింది.

అయినకాడికి అమ్మకాలు

ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన వర్షాలు, వరదలతో పెట్టుబడులు పెరిగిపోయాయి. తుని, కాకినాడ సిటీ(ఇక్కడ వ్యవసాయం లేదు) మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో వరి కోతలు 80 శాతం పూర్తి అయ్యాయి. తుని నియోజకవర్గంలో మాత్రం 20 శాతం, పిఠాపురం నియోజకవర్గంలో 50 శాతం మించి వరి కోతలు అవ్వ లేదు. కోతలు పూర్తి అయి పంట చేతికందిందనే తరుణంలో ఫెంగల్‌ తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లి కోలుకోలేని దెబ్బతీసింది. చేతికందిన పంట కళ్లాల్లోను, రోడ్లపైన బరకాలు వేసి కాపాడుకునే దుస్థితి ఏర్పడింది. తడిసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాక.. తక్కువ ధరకే అమ్ముకుని రైతులు నష్టపోతున్నారు. తుపానుతో తడిసి ముద్దయిన ధాన్యం 90వేల మెట్రిక్‌ టన్నులు జిల్లాలో రోడ్లుపైన, కళ్లాల్లో ఉంది. ఎకరాకు దిగుబడి 30 నుంచి 35 బస్తాలు మాత్రమే వస్తోంది. కౌలుకు చేసిన పంటల్లో ఎకరాకు 30బస్తాలు దిగుబడి వస్తే 10 బస్తాలు కౌలు పోగా, మిగిలిన 20 బస్తాలు పెట్టుబడులకే సరిపోతున్నాయి. ఇక మిగిలేది ఏమీ లేక కౌలు రైతులు కన్నీరు పెడుతున్నారు. దీనికితోడు ఏలేరు, పీబీసీకి వచ్చిన వరదలు కూడా ముంచెత్తడంతో పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, సామర్లకోట మండలాలల్లో పంటలు మునిగిపోయి నష్టపోయారు. ఏలేరు వరదతో పెట్టుబడులు తడిసి మోపెడయ్యాయి. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడికి బదులు రూ.40వేలు అయింది. 40 బస్తాలు దిగుబడి వస్తుందనుకుంటే ఎకరాకు 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ తరుణంలో కూడా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తేమ శాతం నిబంధనలు సడలించక పోవడంతో రైతులు కళ్లాల్లోనే ధాన్యాన్ని అయినకాడికి అమ్మేస్తున్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. శంఖవరం మండలంలో కోతలు ప్రారంభం కాలేదు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో 75కేజీల బస్తా రూ.1,400కు కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం పెద్ద ప్రతిబంధకంగా మారడంతో రైతులు దళారులను అశ్రయిస్తున్నారు. ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40వేలు పెట్టుబడి పెట్టగా ఎకరాకు 30 బస్తాలు మించి దిగుబడి రాలేదు. అంటే ఎకరానికి 10 బస్తాలు దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో ఇటీవల వరదలకు రాజుపాలెం, ముక్కోల్లు, భూపాలపట్నం, రామకృష్ణాపురంలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తేమ శాతం ఎక్కువ ఉందనే సాకు చూపి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్లకుండా వెనక్కు తగ్గుతున్నారు. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి 75 కేజీల బస్తా రూ.1,400కే అమ్ముకుంటున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు గోకవరం మండలంలో 7,020, కిర్లంపూడి మండలంలో 361 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగొలు చేశారు. తేమ శాతమే పెద్ద గుదిబండగా మారడంతో రైతులు రూ.1,450 నుంచి రూ.1,550గా దళారులకు అమ్ముకుంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

దళారులే దిక్కు..

ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైంది. జిల్లాలో పిఠాపురం, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారీలకు తక్కువ ధరకే అమ్ముకున్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 277 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెబుతోంది. ఆ కేంద్రాలలో నామ్‌కే వాస్తేగా కొనుగోలు జరిగిందని రైతు ప్రతినిధులు ఆరోపిస్తుంటే, 85 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసినట్టు జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.1,725గా నిర్ణయించింది. ఈ ధర ధాన్యం విక్రయించిన మెజార్టీ రైతులకు దక్కనే లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
సర్కారు చోద్యం1
1/1

సర్కారు చోద్యం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement