కనువిందు చేసిన జటాజూటాలంకరణ
పంచారామ క్షేత్రంలో ముగిసిన
కార్తిక మాస ఉత్సవాలు
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారి జటాజూటాలంకరణ కనువిందు చేసింది. కార్తిక మాసం ముగింపు రోజు పోలి పాడ్యమి సందర్భంగా స్వామి వారికి వెండి జటాజూటంతో అలంకరణ చేయడం ఆనవాయితీ. ఈ మేరకు బ్యాంకు లాకరులో భద్రపర్చిన వెండి జటాజూటంను ఉత్సవ కమిటీ చైర్మన్, భక్త సంఘం నాయకులు ఆలయానికి తీసుకొని వచ్చారు. జటాజూటంకు వేద పండితులు సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరించారు. స్వామి వారి అలంకరణను తిలకించడానికి సాయంత్రం భక్తులను అనుమతించారు. సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవికి బంగారు కిరీటంతో పాటు బంగారు ఆభరణాలతో అలంకరణ చేశారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకోవడానికి బారులు తీరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహిళల కోలాటం, వీరభద్రుని నృత్యం ఆకట్టుకున్నాయి.
పీజీఆర్‌ఎస్‌కు 308 అర్జీలు
కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో (పీజీఆర్‌ఎస్) అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, సీపీవో పి.త్రినాఽథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, కేఎస్‌ఈజెడ్ ఎస్డీసీ రామలక్ష్మిలతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ, బియ్యం కార్డుల మంజూరు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ల మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 308 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
దివీస్ ఉద్యమ కేసులను కొట్టేసిన కోర్టు
తుని: తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన దివీస్ ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తుని కోర్టు కొట్టేసిందని న్యాయవాది ఆకాశపు మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. జూనియర్ సివిల్ కోర్టులో 2016లో సీపీఎంకు చెందిన 13 మందిపై అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపి అనేక మంది సాక్షులను విచారించింది. అప్పటి ఎస్‌హెచ్‌వో ఇచ్చిన వ్యతిరేక సాక్ష్యంతో కోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు దివీస్ ఉద్యమంలో పోలీసులు పెట్టిన 10 కేసులను కోర్టు కొట్టివేసిందని మల్లేశ్వరరావు తెలిపారు. 13 మందిని నిర్ధోసులుగా భావించిందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సి.మధు, రాష్ట్ర నాయకుడు రావుల వెంకయ్య, కాకినాడ జిల్లా నాయకులు పెంట్యాల నరసింహారావు, ఎం.వేణుగోపాల్, దువ్వా శేషుబాబ్జి, కె.సత్య శ్రీనివాస్, కె.సింహాచలం, ఎం.వీరలక్ష్మి, జి.బేబీరాణి, వెంకటలక్ష్మి, సత్యవతులను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించిందని చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చిన ఉద్యమ కారులను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment