అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలి
కాకినాడ లీగల్: అనాథ పిల్లలను ఆదుకోవడంలోనే సంతృప్తి ఉంటుందని కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి పి.కమలాదేవి అన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలోని జీవనస్ఫూర్తి చిల్ట్రన్ హోమ్‌ను ఆమె నేతృత్వంలోని న్యాయమూర్తులు బృందం ఆదివారం సందర్శించింది. చిన్నారులతో ముచ్చటించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పండ్లు, కేకులు పంపిణీ చేశారు. చిల్డ్రన్ హోమ్‌కు నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందజేశారు. ఈ సందర్భంగా కమలాదేవి మాట్లాడుతూ, అనాథ పిల్లలను ఆదుకోవాలనే సదుద్దేశంతో కాకినాడలో విధులు నిర్వహిస్తున్న 16 మంది న్యాయమూర్తులతో కలిసి ఈ హోమ్‌ను సందర్శించామన్నారు. నూతన సంవత్సరంలో అనాథ పిల్లల అవసరాలు, సమస్యలు తెలుసుకుని, వారికి సహాయపడటం చాలా సంతృప్తినిచ్చిందని చెప్పారు. అనాథ పిల్లల అవసరాలను గుర్తించి, సరైన తోడ్పాటు అందిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం కలుగుతుందని న్యాయమూర్తులు తెలిపారు. పండగల్లో విందులు, వినోదాల పేరిట డబ్బు వృథా చేయకుండా అనాథ పిల్లలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కమలాదేవి కోరారు. న్యాయమూర్తులకు చిల్డ్రన్ హోమ్ ప్రతినిధి సత్యవేణి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment