బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ సొసైటీ యూనియన్ ఆధ్వర్యాన ఉద్యోగులు బుధవారం నుంచి దశల వారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు టి.వెంకట రామయ్య, ట్రెజరర్ పి.సత్యనారాయణ మంగళవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. బుధవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, 9న పార్లర్ రన్‌తోపాటు అన్ని కంప్యూటర్ పనులు నిలుపు చేస్తామని, 10న డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని వివరించారు. ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 27న విజయవాడలోని రాష్ట్ర సహకార బ్యాంకు వద్ద మహా ధర్నా చేపడతామన్నారు. వచ్చే నెల 10వ తేదీలోగా సమస్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేయనున్నామని చెప్పారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు, వేతన సవరణ, రెగ్యులర్ చేయడం, చట్ట ప్రకారం గ్రాట్యుటీ అమలు, ఆడిట్ డ్యుయల్ పద్ధతి రద్దు, సహకార సంఘాలకు ఆదాయ పన్ను మినహాయింపు, షేర్ ధనంపై డివిడెండ్ చెల్లింపు, షేరు ధనంలో సంఘాలకు వాటా కల్పించడం వంటి డిమాండ్లతో పాటు సహకార రంగాన్ని ప్రైవేటు పరం చేయవద్దని కోరుతూ ఈ ఆందోళనలు చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment