దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశం
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని సత్యగిరిపై గల శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపంలో మంగళవారం ప్రైవేట్ కార్యక్రమమైన వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చిన దేవస్థానం అధికారులపై దేవదాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్ కే రామచంద్రమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బుధవారం మీడియాలో ప్రముఖంగా రావడంతో దీనిపై వెంటనే నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. వాసవీ క్లబ్ నాయకులు, ఆ కల్యాణ మండపం సిబ్బంది అది ఆధ్యాత్మిక కార్యక్రమమని నమ్మించడంతో అనుమతి మంజూరు చేసినట్టు అధికారులు వివరణలో పేర్కొన్నట్టు తెలిసింది. ఆ కార్యక్రమం వీడియోలు బయటకు వచ్చేవరకు తమకు కూడా ఆ కార్యక్రమం ప్రమాణ స్వీకారానికి సంబంధించిందని తెలియదని ఆ వివరణలో పొందుపరిచారు. ప్రజాప్రతినిధులు కూడా ఆ కల్యాణ మండపాన్ని వాసవీ క్లబ్ కార్యక్రమానికి ఇవ్వాలని సిఫారసు చేసినట్లుగా కూడా ఆ వివరణలో పేర్కొన్నట్టు సమాచారం.
ఇంటలిజెన్స్ ఆరా...
ఈ వ్యవహారంపై స్టేట్ ఇంటలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీశారు. ఆ కల్యాణ మండపంలో వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలు జరగడానికి వీలు లేదని, ఇటువంటి కార్యక్రమాలు ఎలా అనుమతించారని ప్రశ్నించినట్లు సమాచారం. వారు దేవస్థానం అధికారులకు ఫోన్ చేసి దీనిపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment