పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
మాజీ ఎంపీ తలారి రంగయ్య
పిఠాపురం: ఎన్నికల్లో ఇష్టారాజ్యంగాహామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాకా వాటిని నెరవేర్చలేం అంటూ సాక్షాత్తు ముఖ్యంత్రి ప్రకటించి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించాలని అనంతపురం మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత విశ్వనాథ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం అయింది. మీరు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రభుత్వం అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని అడగండని మంత్రి నారా లోకేశ్ మీడియా ముఖంగా చెప్పారని, అయినా ఎందుకు అడగడం లేదని ఆయన పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. సంక్షేమ క్యాలండర్‌ను విడుదల చేయాలని లేదా ఇవ్వలేమని మీరు కూడా చేతులెత్తేస్తారో తేల్చి చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోని ఒక భగవధ్గీత, ఖురాన్, బైబిల్‌గా దేశంలో ఏ నాయకుడు చూడనట్టుగా అతి పవిత్రంగా చూసారని చెప్పారు. 99 శాతం అమలు చేసారన్నారు. చంద్రబాబు ది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని దుయ్యబట్టారు. వంగా గీత మాట్లాడుతూ కూటమి నేతలు మేము సంపద సృష్టిస్తాం, నిధులు సమకూరుస్తాం సూపర్ సిక్స్ కచ్చితంగా అమలు చేస్తామంటు చెప్పారన్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి బాగోలేదని మాట మారుస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎన్నికల ముందు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. అన్ని తెలిసి మోస పూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేసారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు వారికి అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పచ్చిమళ్ల జ్యోతి, నాయకులు గండేపల్లి బాబీ, జడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, పిఠాపురం నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment