ఇంటర్‌లో నూరు శాతం ఉత్తీర్ణత
కాకినాడ సిటీ: ఇంటర్మీడియెట్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జిల్లాలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రీ ఫైనల్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా రానున్న 25 రోజులూ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులపై అధ్యాప కులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వారిని కేటగిరీలుగా విభజించి, చదివించాలన్నారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి పెట్టి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. తరగతులకు సెల్‌ఫోన్లు తీసుకువచ్చే విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఐఈవో జీజీకే నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీల హాజరు పెంచాలి
రానున్న 45 రోజుల పాటు జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా నిర్వహించాలని, కూలీల హాజరు పెంచాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. డ్వామా, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్లు, గోకులం పశువుల షెడ్లు తదితర పనులన్నింటినీ మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టి ముమ్మరంగా నిర్వహించాలన్నారు. మంజూరు చేసిన ప్రతి పని తప్పనిసరిగా పూర్తి కావాలన్నారు. ఒక్క రూపాయి కూడా వృథా కారాదని స్పష్టం చేశారు. ఈ వారం కూలీల హాజరు ఏలేశ్వరం మండలంలో బాగుందని ప్రశంసించారు. ఉపాధి పనుల అవసరం, అవకాశం ఎక్కువగా ఉన్న కోటనందూరు మండలంలో ఆశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రెడ్‌క్రాస్ సభ్యత్వాలు, విరాళాలు పెంచాలి
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వాలు, విరాళాల సేకరణ, సేవ కార్యక్రమాలను పెద్ద స్థాయిలో చేపట్టాలని అధికారులకు కలెక్టర్ షణ్మోహన్ విజ్ఞప్తి చేశారు. రూ.లక్ష విరాళాలు సేకరించిన వారిని వెండి పతకంతో, రూ.2 లక్షలు ఆపై విరాళాలు సేకరించిన వారిని గోల్డ్ మెడల్‌తో రెడ్‌క్రాస్ సొసైటీ సత్కరిస్తుందని తెలిపారు.
పక్కాగా శివరాత్రి ఏర్పాట్లు
ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాలు, రక్షణ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. భక్తులకు రవాణా, తాగునీరు, సురక్షిత స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునేందుకు రూములు, మరుగుదొడ్లు, బారికేడింగ్, లైటింగ్, సూచనలు ఇచ్చేందుకు, తప్పిపోయిన వారి జాడ తెలిపేందుకు మైక్ సిస్టమ్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ ఏవీఎస్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి ప్రసాద్‌బాబు, ఎంపీడీవోలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
10న నులిపురుగుల నివారణ కార్యక్రమం
నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ నెల 10న 19 ఏళ్లలోపు విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం వాల్‌పోస్టర్లు, కరపత్రాలను కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ఆవిష్కరించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ మొదటి సంవత్సరం, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య కళాశాలల విద్యార్థులకు, పాఠశాలలకు వెళ్లని పిల్లలకు ఈ మాత్రలు ఉచితంగా ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జె.నరసింహ నాయక్, జిల్లా ప్రోగ్రాం అధికారి, ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే అధికారి ఐ.ప్రభాకర్, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఫ అధ్యాపకులకు కలెక్టర్ ఆదేశం
ఫ ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment