భీష్మ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు
అన్నవరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని సన్నిధికి శనివారం వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భక్తులకు నీడ కల్పించేందుకు షామియానాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం ఎదురుగా ప్లాట్‌ఫామ్‌పై, భక్తులు బస్సుల కోసం వేచి ఉండే పార్కింగ్ స్థలంలో షామియానాలు వేశారు. అలాగే, భక్తుల కోసం అదనపు క్యూ లైన్లు, ప్రసాదం, వ్రతాలు, దర్శనం టిక్కెట్లు విక్రయించేందుకు అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పలుచోట్ల మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఈసారి భీష్మ ఏకాదశి, రెండో శనివారం సెలవు రోజున వచ్చినందున సత్యదేవుని సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ రాజగోపురం వద్ద భక్తుల కోసం కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులను ఈ కంపార్ట్‌మెంట్లలో ఉంచి తోపులాట లేకుండా దర్శనానికి పంపించనున్నారు. ఈ కంపార్ట్‌మెంట్లలో భక్తులకు మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు కూడా పంపిణీ చేయనున్నారు. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు రత్నగిరికి చేరుకుంటారు. అప్పటి నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు శనివారం ఉదయం 8 గంటల నుంచి పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ
రత్నగిరిపై భీష్మ ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు బుధవారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. గత కార్తిక మాసంలో మాదిరిగానే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, భక్తుల నుంచి విమర్శలు లేకుండా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ పలుచోట్ల షామియానాలు,
అదనపు కౌంటర్లు
ఫ పశ్చిమ రాజగోపురం వద్ద
కంపార్టుమెంట్లు
ఫ భక్తులకు మంచినీరు
అందించేందుకు ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment