పోలవరం కాలువ పనులు అడ్డుకున్న నిర్వాసితులు
తుని రూరల్: మండలంలోని కుమ్మరిలోవ కాలనీ వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందిని కాలనీ నిర్వాసితులు అడ్డుకున్నారు. తహసీల్దార్ ప్రసాద్, రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ సంస్థ ఆర్‌వీఆర్ సిబ్బంది బుధవారం జేసీబీతో ఆ ప్రాంతానికి వెళ్లారు. పనులు చేస్తూండగా కాలనీ నిర్వాసితులు, భూ నిర్వాసితులు వారిని అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని, అప్పటి వరకూ వద్దని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా కొనసాగుతున్న తమ సమస్య పరిష్కరించకుండా కాలువ పనులు చేయన్విబోమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చెల్లింపులు పూర్తయినచోటే పనులు చేపడుతున్నామని తహసీల్దార్, కాంట్రాక్ట్ సిబ్బంది చెప్పారు. తాము కోర్టు నుంచి స్టే పొందామని కొంతమంది రైతులు, కాలనీలోని ఇళ్ల నిర్వాసితులు పేర్కొన్నారు. అటువంటి పత్రాలుంటే రేపటిలోగా ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. కాలనీలో ఇళ్లు కోల్పోతున్న 165 కుటుంబాలకు, 40 ఎకరాల రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని నిర్వాసితులు తెలిపారు. ఇళ్లు కోల్పోతూండటంతో 15 ఏళ్లుగా మరమ్మతులు చేయించకుండానే బిక్కుబిక్కుమంటూ నివాసం ఉంటున్నామని, ఈ దశలో పనులు చేస్తే ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకం పనులు చేపట్టలేదని, జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేస్తున్నామని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. దీనివల్ల ఇళ్లు కూలిపోయే అవకాశం ఉండదన్నారు. కోర్టు నుంచి ఎటువంటి పత్రాలున్నా తమకు చూపించాలని, పనులు అడ్డుకోవడం సరికాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment