విషమ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

విషమ పరీక్ష

Published Thu, Feb 6 2025 12:13 AM | Last Updated on Thu, Feb 6 2025 12:12 AM

విషమ

విషమ పరీక్ష

జిల్లాలో పదో తరగతి

విద్యార్థుల వివరాలు

పాఠశాలలు 457

పరీక్ష కేంద్రాలు 142

పరీక్షలు రాయనున్న బాలికలు 13,735

బాలురు 13,763

మొత్తం 27,498

ఒక్కో విద్యార్థికి స్టడీ మెటీరియల్‌

ప్రింటింగ్‌ ఖర్చు రూ.1,000

జిల్లా వ్యాప్తంగా విద్యార్థులపై

భారం రూ.2.75 కోట్లు

పిఠాపురం: ఉన్నత విద్యాభ్యాసానికి కీలకమైన 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందువలన ఈ పరీక్షలకు విద్యార్థులను అన్నివిధాలా సంసిద్ధుల్ని చేయడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి. వచ్చే నెల 17 నుంచి 31వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. నూరు శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో విద్యా శాఖ అధికారులు ఇప్పటికే వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రణాళికను విద్యా శాఖ రూపొందించింది. దీని ప్రకారం చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా క్లాసులు చెబుతూ, సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్‌ను అందించాలి. అయితే ఇంతవరకూ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. స్టడీ మెటీరియల్‌ ఇచ్చేందుకు తమ వద్ద నిధులు లేవంటూ ఆ భారాన్ని విద్యార్థుల పైనే మోపుతోంది. వంద రోజుల ప్రణాళికలో ఇప్పటికే 60 రోజులు పూర్తయిపోయాయి. మరోవైపు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు మరో 38 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. గడువు దగ్గర పడుతున్నప్పటికీ ప్రభుత్వం విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ మాత్రం అందించలేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా అక్టోబర్‌ నెలలోనే స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసేవారు. ఈసారి కూటమి ప్రభుత్వం స్టడీ మెటీరియల్‌ పంపిణీలో చేతులెత్తేసింది.

విద్యార్థుల పైనే భారం

రాష్ట్ర విద్యా శాఖ తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను పీడీఎఫ్‌ ఫైల్‌ రూపంలో పాఠశాలలకు పంపించారు. ఇది అన్ని సబ్జెక్టులకూ కలిపి 500 పేజీల వరకూ ఉంది. ఒక్కో పేపర్‌ ప్రింటింగ్‌కు జిరాక్స్‌ షాపుల్లో రూ.2 ఖర్చవుతోంది. ఈ లెక్కన 500 పేజీల స్టడీ మెటీరియల్‌ ప్రింటింగ్‌కు రూ.1,000 వరకూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఖర్చవుతోంది. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 27,498 మంది ఉండగా.. వీరందరిపై ప్రింటింగ్‌ ఖర్చుల భారం సుమారు రూ.2.75 కోట్లు పడుతోంది. ఒకేసారి ఇంత ఖర్చు భరించలేక పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, సకాలంలో స్టడీ మెటీరియల్‌ చేతికి అందక.. పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలో అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు స్టడీ మెటీరియల్‌ చేతిలో లేకపోవడంతో విద్యార్థులను పరీక్షలకు ఏవిధంగా సిద్ధం చేయాలో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమ పాఠశాలకు స్టడీ మెటీరియల్‌ రాలేదని చెప్పడానికి కూడా వారు భయపడుతున్నారు. ‘దయచేసి మమ్మల్ని వీధిలో పెట్టకండి. మేము చెప్పినట్లు తెలిస్తే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు’ అని చెబుతున్నారు.

విద్యార్థులపై భారాలు దారుణం

కూటమి ప్రభుత్వం ఈ ఏడాది స్టడీ మెటీరియల్‌ ఇవ్వకుండా విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం దారుణం. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడానికే అన్నట్టుగా సర్కారు ధోరణి ఉంది. ఇలాగైతే మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి? ఉచిత చదువులు అంటూ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకురావడం సిగ్గుచేటు. ఇప్పటికై నా స్టడీ మెటీరియల్‌ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– ఎం.గంగా సూరిబాబు,

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ

విద్యాభివృద్ధికి తోడ్పడే తల్లికి వందనం (గతంలో అమ్మ ఒడి), ఫీజు రీయిబర్స్‌మెంట్‌ వంటి పథకాలకు ఇప్పటికే మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. చివరకు టెన్త్‌ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ఇవ్వడంలోనూ మొండిచేయి చూపుతోంది. ‘చదువుకోవాలనుకుంటే మీ డబ్బుతో మీరే ప్రింట్లు తీయించుకోండి’ అంటూ విద్యార్థులకు ప్రింట్‌ డాక్యుమెంట్‌ ఫార్మాట్‌ (పీడీఎఫ్‌) ఫైల్స్‌ మాత్రమే ఆయా పాఠశాలల ద్వారా అందిస్తోంది. దీంతో, వాటిని ప్రింట్‌ తీయించుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు చేతిచమురు వదిలిపోతోంది.

ప్రతిపాదనలు పంపించాం

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించాం. త్వరలో ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటాం.

– పి.రమేష్‌, జిల్లా విద్యా శాఖాధికారి, కాకినాడ

ఫ టెన్త్‌ విద్యార్థులతో

కూటమి సర్కార్‌ చెలగాటం

ఫ పీడీఎఫ్‌ రూపంలో

స్టడీ మెటీరియల్‌ అందజేత

ఫ ప్రింటింగ్‌ చేయించుకోవాలని సూచన

ఫ తల్లిదండ్రులకు

వదిలిపోతున్న చేతిచమురు

ఫ జిల్లా విద్యార్థులపై

రూ.2.75 కోట్ల భారం

No comments yet. Be the first to comment!
Add a comment
విషమ పరీక్ష1
1/2

విషమ పరీక్ష

విషమ పరీక్ష2
2/2

విషమ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement