మహాత్మా.. మన్నించు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాకేంద్రంలోని గాంధీ గంజ్ మురికి కూపంలా మారిపోయింది. ఆపై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అయ్యింది. గతంలో గొప్ప పేరున్న గాంధీ గంజ్.. పాలకులు పట్టించుకోకపోవడంతో నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. రైతుల పండించిన పంటలను కొనుగోలు చేయడానికి గంజ్ మార్కెట్‌ను నిర్మించా రు. దానికి గాంధీ పేరు పెట్టారు. ఈ గంజ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఖ్యాతికెక్కింది. అప్పట్లో బెల్లం వ్యాపారంలో కామారెడ్డి గాంధీ గంజ్‌కు ఎంతో పేరుండేది. ఇక్కడి నుంచి గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు బెల్లం తరలివెళ్లేది. బెల్లం రైతుపై కక్ష గట్టిన నాటి చంద్రబాబు సర్కారు.. నల్లబెల్లం పేరుతో ఆంక్షలు విధించి బెల్లం వ్యాపారాన్ని దెబ్బతీసింది. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక బెల్లంపై ఆంక్షలు ఎత్తివేయడంతో ఆయన కాలంలో మరోసారి ఓ వెలుగు వెలిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక్కడ తయారు చేసే నల్లబెల్లం గుడుంబాకు వెళ్తోందంటూ పాలకులు బెల్లంపై ఆంక్షలు విధించారు. తయారు చేయకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో బెల్లం దందా బందైంది. అప్పటి నుంచి గంజ్ ఉనికి కోల్పోయింది. మక్కలు, వడ్ల దందా నడుస్తుండగా.. కూరగాయలు, మటన్, ఫిష్ మార్కెట్ కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించడం కోసం గంజ్‌లోని షెడ్లన్నింటినీ తొలగించారు. కొత్త మార్కెట్ కోసం పనులు మొదలుపెట్టినా.. నిధుల సమస్య తో అదీ మధ్యలోనే నిలిచిపోయింది. క్రమంగా గంజ్ ప్రాభవం కోల్పోయింది. ప్రస్తుతం గంజ్ అస్తి త్వాన్ని కోల్పోయింది. అక్కడి పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో చెత్త తెచ్చి పడేస్తుండడంతో మురికి కూపంగా మారింది. గంజ్ తమది కాదన్నట్లుగా మార్కెట్ కమిటీ వ్యవహరిస్తుండడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. పట్టించుకునేవారు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చీకటి పడితే చాలు గంజ్‌లోని అసంపూర్తిగా మిగిలిన ఇంటిగ్రెటెడ్ మార్కెట్‌లో విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారు. వ్యభిచారానికి సైతం ఈ ప్రాంతం అడ్డాగా తయారయ్యింది. పాలకులు పట్టించుకుని గాంధీ గంజ్‌కు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మురికి కూపంలా తయారైన
జిల్లాకేంద్రంలోని గాంధీ గంజ్
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
పట్టించుకోని పాలకులు
Comments
Please login to add a commentAdd a comment