కాంగ్రెస్‌లో ముదిరిన లొల్లి..!
– 9లో u
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లో u
అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త, పాత నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. ఎమ్మెల్యేలు పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడి పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేసి కొత్తగా చేరిన వారికి పదవులు ఇస్తున్నారంటూ ఆయా నియోజకవర్గాల్లో నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతుండడంతో శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుతున్నాయి. అన్ని నియోజకవర్గాలలో ఆధిపత్యం కోసం పాత, కొత్త నేతలు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. దీంతో గొడవలు పెరిగిపోతున్నాయి. నామినేటెడ్ పదవుల విషయంలో ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటవుతుండడంతో మరో వర్గం నిరాశకు లోనవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు ఉత్సాహం చూపుతుండడంతో టికెట్ల కేటాయింపు సమయంలో విభేదాలు మరింత రచ్చకెక్కుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాన్సువాడలో..
బాన్సువాడ నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక్కడ నిత్యం ఏదో ఒక గొడవ నడుస్తూనే ఉంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తానే బాస్‌నని పోచారం అంటుండగా, నియోజకవర్గ ఇన్‌చార్జీగా తానే ఉన్నానని ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. బాన్సువాడలో ఏనుగుకు ఏం పని అంటూ ఇటీవల పోచారం ప్రశ్నించారు. తాను బాన్సువాడను వదిలివెళ్లే ప్రసక్తే లేదని, ఇక్కడే ఉండి కార్యకర్తలకు అండగా నిలుస్తానని ఏనుగు రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు పోచారం వర్గానికే దక్కుతుండడంతో ఏనుగు వర్గానికి చెందిన నేతలు ఆందోళనలూ చేస్తున్నారు. బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో పాత వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవి ఇస్తే ఊరుకునేది లేదంటూ గురువారం కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీకోసం కష్టపడ్డవారికే పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జుక్కల్‌లో..
జుక్కల్ నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మార్కెట్ కమిటీ చైర్మన్‌ల నియామకం విషయంలో వినూత్న పద్ధతి అవలంబించారు. ఈ విషయంలో ఆయన పార్టీ నాయకత్వం నుంచి అభినందనలు అందుకున్న మరుసటి రోజే నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు కొందరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్ మండలాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు గాంధీభవన్‌కు వెళ్లి నిరసన తెలిపారు. పదవుల విషయంలో ఎమ్మెల్యే తమకు అన్యాయం చేస్తున్నారని, సీనియర్లని కూడా చూడకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. పార్టీకి నష్టం చేసిన ఒకరిద్దరు నేతలు, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ ఒకరు కలిసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తాను న్యాయం చేస్తున్నానన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు వర్గానికి, సుభాష్‌రెడ్డి వర్గానికి మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇటీవల సుభాష్‌రెడ్డి వర్గం నేతపై ఎమ్మెల్యే వర్గీయులు దౌర్జన్యం చేశారంటూ సుభాష్‌రెడ్డి రచ్చ చేశారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే నేరుగా తనతో తలపడాలని, తన అనుచరుల జోలికి వస్తే ఊరుకోనని హెచ్చరించారు. సుభాష్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే అనుచరులు గట్టిగానే స్పందించారు. ఎమ్మెల్యేను ఒక్క మాట అన్నా ఊరుకోమని హెచ్చరించారు.
కామారెడ్డి నియోజక వర్గంలోనూ కింది స్థాయిలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలున్నాయి. అయితే అందరూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెంటే ఉండడంతో విభేదాలు బయటపడడం లేదు.
న్యూస్‌రీల్
కొత్త, పాత నేతల మధ్య ఆధిపత్య పోరు
బాన్సువాడలో రోడ్డెక్కిన ఏనుగు వర్గం
గాంధీ భవన్ మెట్లెక్కిన జుక్కల్ నేతలు
ఎల్లారెడ్డిలోనూ గ్రూపు తగాదాలు
అయోమయంలో పార్టీ శ్రేణులు
Comments
Please login to add a commentAdd a comment