కొలిక్కిరాని విచారణ!
● మూడు మరణాలపై వీడని సస్పెన్స్
● సైబర్ ఫోరెన్సిక్ రిపోర్టులే కీలకం
● వాటి కోసం మరికొన్ని రోజులు
ఆగాల్సిందే
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు లో సీఐ, కానిస్టేబుల్‌తోపాటు మరో వ్యక్తి మృతదేహాలు లభించిన కేసులో విచారణ కొలిక్కి రావడం లేదు. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు ముందుకు కదలడం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కేసును ఛేదించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ముగ్గురి మొబైల్స్‌ను సైబర్ ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. రెండు ఐ ఫోన్ల లాక్ ఓపెన్ అయితే.. అందులో లభించే సమాచారం, సైబర్ ఫోరెన్సిక్ రిపోర్టులు కేసు విచారణలో కీలకం కానున్నాయి. అయితే వాటి కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని భావిస్తున్నారు.
భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట ఠాణాలో పనిచేసే కానిస్టేబుల్ శ్రుతితోపాటు బీబీపేటకు చెందిన ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు ఈనెల 25 అర్ధరాత్రి దాటిన తర్వాత అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో లభించిన విషయం తెలిసిందే. ముగ్గురు ఎందుకు అక్కడికి వెళ్లారు? వారి మధ్యనున్న వివాదం ఏమిటి? చనిపోవాల్సినంత అవసరమేమొచ్చింది? అన్న అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. వారు చెరువు వద్ద మాట్లాడుకున్నపుడు గానీ, చెరువు నీటిలో మునిగిన సమయంలో గానీ ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో సాక్ష్యాలు లభించలేదు. మిగిలిన ఆధారం ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లు మాత్రమే. సాయికుమార్, శ్రుతి, నిఖిల్ ఫోన్లను శనివారం ల్యాబ్‌కు పంపించారు. సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు వాటి లాక్ ఓపెన్ చేసి విచారణకు అవసరమైన సమాచారాన్ని తీసుకుని నివేదికను పోలీసు అధికారులకు అందజేస్తారు. అప్పుడు కేసు విచారణ ముందుకు వెళుతుందని అంటున్నారు.
ఏం జరిగి ఉంటుందన్న దానిపై చర్చ
ముగ్గురి మరణంపై ఎక్కడ చూసినా నాలుగు రోజులుగా చర్చ నడుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో అట్లా జరిగి ఉండొచ్చని, ఇట్లా జరిగి ఉండొచ్చనే ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. చనిపోయిన వారిలో ఎస్సై, కానిస్టేబుల్ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏం జరిగి ఉంటుందన్న దానిపై చర్చించుకుంటున్నారు. మీడియాలో వస్తున్న వార్తలు, కథనాలు, అలాగే సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సైబర్ ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే ఏం జరిగి ఉంటుందన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment