నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డను.. | - | Sakshi
Sakshi News home page

నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డను..

Published Mon, Dec 30 2024 1:48 AM | Last Updated on Mon, Dec 30 2024 1:48 AM

నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డను..

నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డను..

తప్పు చేయలేదు.. భయపడే ప్రసక్తే లేదు

కేసీఆర్‌ను ఎదుర్కోలేకే మాపై కేసులు

రానున్నది బీఆర్‌ఎస్‌ శకం..

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఘనస్వాగతం పలికిన బీఆర్‌ఎస్‌

నాయకులు, కార్యకర్తలు

నిజామాబాద్‌నాగారం/నిజామాబాద్‌ రూరల్‌: తాను నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డనని, తాను ఏ తప్పూ చేయలేదని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే తనతోపాటు కేటీఆర్‌పై కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని ఆరోపించారు. లిక్కర్‌ కేసులో జైలు నుంచి విడుదలైన తరువాత ఆదివారం మొదటిసారి నిజామాబాద్‌ పర్యటనకు వచ్చిన కవితకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్‌ తోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. అక్కడి నుంచి నిజామాబాద్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని చంద్రశేఖర్‌కాలనీ చౌరస్తా నుంచి పాదయాత్రగా బయల్దేరిన కవిత.. సుభాష్‌నగర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లమని, గట్టిగా నిలబడుతామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. హామీల అమలులో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ విఫలమైందని, గ్రామగ్రామాన హామీలపై కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించారని, దీంతో మహిళలే కాకుండా సాధారణ ప్రజలు, అటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ సత్తాచాటి మరోసారి నిజామాబాద్‌ పవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డికి రుచి చూపిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement