వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల తరలింపు!
నాగిరెడ్డిపేట: జిల్లాలోని ఏకై క వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను సిద్దిపేట జిల్లాకు తరలిస్తున్నారు. ఇప్పటికే సెకండియర్ విద్యార్థులను పంపించిన అధికారులు.. త్వరలో ఫస్టియర్ విద్యార్థులనూ పంపించడానికి సిద్ధమవుతున్నారు. తక్కువ అడ్మిషన్లు రావడం, సరైన వసతులు లేకపోవడాన్ని సాకులుగా చూపుతూ ఈ చర్యలు తీసుకుంటున్నారు.
మాల్తుమ్మెద శివారులో 2015లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్‌లో 30, సెకండియర్‌లో 30 చొప్పున సీట్లు కేటాయించారు. తర్వాత కళాశాలలోని ఒక్కో తరగతిలోని సీట్లను 30 నుంచి 20కి కుదించారు. మొదట్లో మాల్తుమ్మెద విత్తన క్షేత్ర భవనంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల తరగతులను నిర్వహించారు. తర్వాత కళాశాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నూతన భవనంలోకి మార్చారు. విద్యార్థులకు పాఠాలను బోఽధించేందుకు ప్రిన్సిపాల్‌తోపాటు తాత్కాలికంగా ఒక టీచింగ్ అసోసియేట్‌ను నియమించారు. తప్పనిసరైన పరిస్థితుల్లో కళాశాల పక్కనే ఉన్న డాట్ సెంటర్‌లోని అధికారులు విద్యార్థులకు క్లాసులు తీసుకుంటున్నారు. విద్యార్థులకు విత్తనోత్పత్తి క్షేత్ర భవనంలోనే హాస్టల్ వసతి ఉంది. కాగా హాస్టల్‌లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతోపాటు విద్యార్థులు తక్కువ సంఖ్యలో నమోదు కావడంతో ప్రస్తుతం మాల్తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను సిద్దిపేట జిల్లా తోర్నాలలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలకు తరలిస్తున్నారు.
పరీక్షలు కాగానే ఫస్టియర్ విద్యార్థులు..
మాల్తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సెకండియర్‌లో 13 మంది విద్యార్థులున్నారు. వీరిని గతనెలలో తోర్నాలలోని కళాశాలకు తరలించారు. ప్రస్తుతం కళాశాలలో ఫస్టియర్ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వీరికి గురువారంనుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 7వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మాల్తుమ్మెద కళాశాలలోని 12 మంది ఫస్టియర్ విద్యార్థులను సైతం తోర్నాలకు తరలించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు.
మాల్తుమ్మెద నుంచి సిద్దిపేటకు..
ఇప్పటికే సెకండియర్ విద్యార్థులను
పంపించిన అధికారులు
త్వరలో ఫస్టియర్ విద్యార్థులు కూడా..
సరైన వసతులు లేకపోవడంతో నిర్ణయం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
ప్రస్తుతం కళాశాలలో ఫస్టియర్‌లో 12 మంది, సెకండియర్‌లో 13 మంది విద్యార్థులున్నారు. కళాశాలకు అనుబంధంగా సొంత హాస్టల్ భవనం లేదు. దీంతో విద్యార్థులకు విత్తన క్షేత్ర భవనంలోనే తాత్కాలికంగా హాస్టల్ వసతి కల్పించారు. తాత్కాలికంగా కేటాయించిన హాస్టల్ భవనంలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ అధికారులు ఇక్కడి విద్యార్థులను తోర్నాలకు తరలించాలని నిర్ణయించారు. ఇప్పటికే సెకండియర్ విద్యార్థులను అక్కడికి పంపించాం. త్వరలోనే ఫస్టియర్ విద్యార్థులను కూడా అక్కడికే పంపిస్తాం.
– మాధవీలత, ప్రిన్సిపాల్, మాల్తుమ్మెద
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment