కలెక్టర్ సంగ్వాన్, డీఎఫ్‌వో నిఖిత, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఎస్పీ సింధుశర్మ
ఐదుగురు సివిల్ సర్వీసెస్ యువ అధికారులు
వీరితో పాటు ఇద్దరు అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ
మరో ఇద్దరు ఆర్డీవోలు, ఇద్దరు డీఎస్పీలు
జిల్లా పరిపాలనలో పూర్తిస్థాయి అధికారులు
జిల్లాలో యువ సివిల్ సర్వీసెస్ అధికారులు పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌వో, బాన్సువాడ సబ్ కలెక్టర్ తమ ప రిధిలో నిత్యం తనిఖీలు చేస్తూ సిబ్బందికి సూచనలు చేస్తు న్నారు. పథకాలు ప్రజలకు చేరేలా చూస్తున్నారు. వీరికి తోడు ఇటీవల యువ ఏఎస్పీగా చైతన్యరెడ్డి బాధ్య తలు చేపట్టారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా పరిపాలనలో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా కలెక్టర్‌గా యువ ఐఏఎస్ అధికారి ఆశిష్ సంగ్వాన్ ఉండగా, ఎస్పీగా యువ ఐపీఎస్ అధికారి సింధుశర్మ, జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌వో)గా ఐఎఫ్‌ఎస్ అధికారి నిఖిత పనిచేస్తున్నారు. వీరికి తోడుగా ఇటీవలే బాన్సువాడకు సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి కిరణ్మయి వచ్చి చురుగ్గా పనిచేస్తున్నారు.
తాజాగా కామారెడ్డికి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా ఐపీఎస్ అధికారి చైతన్యరెడ్డి వచ్చారు. సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు ఐదుగురూ యంగ్ ఆఫీసర్లే కావడం విశేషం. వీరికి తోడుగా జిల్లా పరిపానలో అపార అనుభవం ఉన్న అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీనివాస్‌రెడ్డి, మరో అదనపు కలెక్టర్ వి విక్టర్ (రెవెన్యూ) పనిచేస్తున్నారు. అలాగే జిల్లా పోలీసు శాఖలో అదనపు ఎస్పీగా కె నర్సింహారెడ్డి ఉన్నారు.
గతంలో ఒక అధికారి ఉంటే ఒక పోస్టు ఖాళీగా ఉండేది. ఈ సారి కీలకమైన పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. ఇద్దరు ఐఏఎస్‌లు అది కూడా యువ అధికారులు ఉండడం, ఇద్దరు ఐపీఎస్‌లు వాళ్లు కూడా యంగ్ ఆఫీసర్లు ఉండడంతో పరిపాలనలో దూకుడుగా ఉండేందుకు అవకాశాలున్నాయి.
ఇదే సమయంలో కామారెడ్డిలో ఆర్డీవోగా రిటైర్మెంట్‌గా దగ్గరలో ఉన్న రంగనాథ్‌రావు, ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ పనిచేస్తున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిలో డీఎస్పీలు ఉన్నారు. మొత్తంగా చిన్న జిల్లా అయినా ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లు, ఒక ఐఎఫ్‌ఎస్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, ఒక అదనపు ఎస్పీ ఉండడం విశేషం. వీటికి తోడు చాలా శాఖల్లో కీలకమైన విభాగాలకు యువ అధికారులు ఉన్నారు.
అనుభవమున్న అధికారులూ ఉన్నారు
జిల్లాలో యువ అధికారులతో పాటు అనుభవం ఉన్న వారు సైతం పనిచేస్తున్నారు. అనుభవజ్ఞుడైన జిల్లా అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్‌రెడ్డి స్థానిక సంస్థలకు సంబంధించి పరిపాలనా వ్యవహారాలు చూస్తున్నా రు. మరో అదనపు కలెక్టర్ వి విక్టర్ రెవెన్యూ, సివిల్ సప్లయిస్ వంటి వాటిని చూస్తున్నారు. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డిలో ఆర్డీవోలు రంగనాథ్‌రావు, ప్రభాకర్ పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో బాన్సువాడ, ఎల్లారెడ్డి డీఎస్పీలు పనిచేస్తున్నారు.
జిల్లా స్థాయిలో అధికారులు చాలా మంది చురుకై న, అనుభవం కలిగిన అధికారులున్నారు. రెండు, మూడు శాఖలు తప్ప అన్ని శాఖలకు రెగ్యులర్ అధికారులు ఉండడంతో పరిపాలనకు అనుకూల వాతావరణం ఉంది. యువ అధికారుల సారథ్యంలో జిల్లా ప్రగతి పరుగులు తీస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.
పనితీరుతో గుర్తింపు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో పనిచేస్తూ పరిపాలనలో తనదైన వేసుకున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్‌లో బయోమెట్రిక్ విధానం అమలు చేయడం ద్వారా ఉద్యోగులు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను తనిఖీ చేస్తూ పనితీరు మెరుగపడేలా చర్యలు తీసుకున్నారు. ధరణి సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ వేలాది దరఖాస్తులను పరిష్కరించారు. ఇంటర్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఫోకస్ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలుతో పాటు తనదైన శైలిలో పనిచేస్తూ దూసుకుపోతున్నారు.
● ఎస్పీ సింధుశర్మ పోలీసు శాఖపై తనదైన ముద్ర వేసుకున్నారు. కేసుల నమోదు నుంచి పరిశోధన, నేరస్తులకు శిక్షలు పడేవరకు ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా అటవీ అధికారి నిఖిత అటవీ అభివృద్ధి, అడవుల రక్షణ విషయంలో నిక్కచ్చిగానే వ్యవహరిస్తున్నారు. బాన్సువాడ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కిరణ్మయి తన పరిధిలోని ఆయా మండలాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. వెనకబడిన ప్రాంతమైన బిచ్కుందలో ప్రజావాణిని కూడా ప్రారంభించి ప్రజల విన్నపాలు విన్నారు. మరో యువ ఐపీఎస్ అధికారి చైతన్య నిన్నమొన్ననే ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టి సబ్ డివిజన్ పరిధిలో నేరాలు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో యువ అధికారులతో మంచి టీం ఏర్పడింది. అందరూ సమన్వయంతో పనిచేస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment