సైబర్ మోసానికి యువకుడి బలి
లింగంపేట: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అయిలాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి గంగరాజు(28) కుటుంబం కొంత కాలంగా లింగంపేటలో నివాసం ఉంటోంది. తండ్రితో కలిసి మండలకేంద్రంలో వడ్రంగి వృత్తి చేసుకుంటున్నాడు. ఆయనకు ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. బెంగళూరునుంచి మాట్లాడుతున్నామని, ఇంటి నిర్మాణం కోసం లోన్ ఇస్తామని, ప్రాసెసింగ్‌కు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అవతలి వ్యక్తి నమ్మించాడు. దీంతో గంగరాజు విడతల వారీగా రూ. 52,500 వరకు ఆన్‌లైన్‌లో పంపించాడు. ఎంతకీ రుణం మంజూరు కాకపోవడంతో తాను ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిన వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించగా తనకేం తెలియదని బుకాయించాడు. దీంతో మోసపోయానని గుర్తించిన గంగరాజు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. శుక్రవారం కూతురు ఆధార్‌కార్డు గురించి భార్య పుట్టింటికి వెళ్లింది. అదే రోజు ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన గంగరాజు తిరిగి రాలేదు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు లింగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం లింగంపేట ఊర చెరువు తూము వద్ద గంగరాజు చెప్పులు కనిపించాయి. దీంతో పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో గాలించగా గంగరాజు మృతదేహం లభించింది. చనిపోవడానికి ముందు గంగరాజు తన చావుకు వాడే(లోన్ ఇప్పిస్తానన్న ఫోన్‌లో నమ్మించిన వ్యక్తి) కారణమని వాట్సాప్ గ్రూపులలో మెస్సేజ్‌లు పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య సోని, కూతురు నవ్యశ్రీ, తల్లిదండ్రులు అనసూయ, దర్శన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment