నిధులు వెనక్కి!
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్ట్ ఉపకాలువల మరమ్మతులకు మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. నిజాం కాలంలో నిర్మించిన పోచారం ప్రధాన కాలువకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఆధునికీకరణ పనులు చేపట్టారు. అనంతరం కాలువ మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ప్రస్తుతం పోచారం ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలు అధ్వానంగా మారాయి. బుంగలు పూడ్చకపోవడం, సైడ్‌వాల్స్ నిర్మించకపోవడంతో సాగునీరు వృథాగా పోతుంది. వీటి మరమ్మతులకు గతంలోనే నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కింద నిధులు సైతం మంజూరయ్యాయి. కానీ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టలు ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. బిల్లులు సకాలంలో రావేమోననే భయంతోనే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టలెవరూ ముందుకు రావడం లేదని నీటిపారుదలశాఖలోని ఓ అధికారి తెలిపారు.
వెనక్కిపోయిన నిధుల వివరాలు
● పోచారం ప్రధాన కాలువకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ–10ఏ శిథిలావస్థకు చేరింది. దీని మరమ్మతులకు 2022లోనే రూ.2.09లక్షలు మంజూరు అయ్యాయి. ఈ పనుల కోసం అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ నిధులు తిరిగి వెళ్లిపోయాయి.
● డిస్ట్రిబ్యూటరీ– 38ఏ బ్యారెల్ చెడిపోయింది. దీనికి మరమ్మతులు చేపట్టేందుకు 2023లో రూ.7.6 లక్షలు మంజూరు అయ్యాయి.
● డి–44కు సైడ్‌వాల్స్ నిర్మాణం చేపట్టేందుకు 2023లో రూ.6.50లక్షలు మంజూరయ్యాయి.
● పోచారం ప్రధాన కాలువ గేట్ల వద్ద సిబ్బంది కోసం గదిని నిర్మించేందుకు 2021లో రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి.
● నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్ శివారులో గ ల ప్రధాన కాలువపై ఉన్న ఇరుకు వంతెనకు మర మ్మతులు చేపట్టేందుకు 2021లో రూ.2.09 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.
ఎవరూ ముందుకు రావడం లేదు
పోచారం ప్రధాన కాాలువకు సంబంధించిన కొన్ని డిస్ట్రిబ్యూటరీలకు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. మరికొన్ని డిస్ట్రిబ్యూటరీల కాలువలు దెబ్బతిన్నాయి. దీంతో సాగు నీరు చివరి ఆయకట్టుకు అందించడం కష్టమవతుంది. కాలువలకు మరమ్మతులు చేపట్టేందుకు గతంలోనే నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.
– వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డీఈఈ, ఎల్లారెడ్డి
పోచారం ఉపకాలువల మరమ్మతులకు
నిధుల కేటాయింపు
పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు
రాకపోవడంతో వెనక్కి వెళ్లిన వైనం
Comments
Please login to add a commentAdd a comment