ఐదేళ్లయినా పునరావాసం లేదు
● భూమి కోసం కార్యాలయాల
చుట్టూ ప్రదక్షిణలు
● మాజీ మావోయిస్టు
క్యాతం శ్రీనివాస్ ఆవేదన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వానికి లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పడమే తప్ప వారిని ఆదుకోవడం లేదు. తమకు ఇస్తామన్న భూమి కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి వేసారుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందిన క్యాతం శ్రీనివాస్ అలియాస్ సమీర్ సీపీఐ మావోయిస్టు పార్టీలో మూడు దశాబ్దాలకుపైగా పనిచేశారు. ఆ పార్టీలో నార్త్ రీజియన్ బ్యూరో మెంబర్‌గా పనిచేసి 2019 డిసెంబర్ 24 న లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వం ఐదెకరాల భూమి, ఇంటి స్థలం ఇవ్వాలన్న ఆదేశాలున్నాయి. క్యాతం శ్రీనివాస్ తనకు ఎలాంటి ఉపాధి లేదని, పునరావాస పథకంలో భాగంగా వ్యవసాయ భూమి ఇవ్వాలని అప్పటి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. శ్రీనివాస్‌కు సంబంధించిన ఫైల్ ఇప్పటికీ సీసీఎల్‌ఏలో పెండింగ్‌లో ఉంది. పునరావాసం విషయమై ప్రజావాణిలోనూ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. అయినా పని జరగడం లేదు. ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నానని శ్రీనివాస్ ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి ఆస్తిపాసులు లేవని, ప్రభుత్వం భూమి చూపిస్తే వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తానని పేర్కొంటున్నారు. కలెక్టర్, ఎస్పీ చొరవ చూపి సీసీఎల్‌ఏలో పెండింగ్‌లో ఉన్న తన ఫైల్‌ను క్లియర్ చేయించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment