కామారెడ్డి ప్రజా సంఘాల
నేతల డిమాండ్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అక్రమాలకు పాల్పడుతున్న కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి ప్రజా సంఘాల నేతలు, సీనియర్ న్యాయవాదులు వీఎల్ నర్సింహారెడ్డి, జి.జగన్నాథం, క్యాతం సిద్దరాములు డిమాండ్ చేశారు. ఇటీవల భిక్కనూరులోని ఆర్టీసీ పెట్రోల్ బంకులో ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన పొరపాటును అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిపై నెట్టి బలి చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో విచారణ అధికారులు ఇచ్చిన నివేదికను తారుమారు చేసే కుట్ర జరుగుతున్నట్టు కార్మికుల ద్వారా తెలిసిందని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.
కామారెడ్డి డిపో మేనేజర్ కార్మికులను దూషిస్తున్నారని, ప్రమోషన్ పొందిన కార్మికులతో డిపో కార్యాలయానికి కావలసిన కుర్చీలు కొనిపిస్తున్నారని, బోర్ రిపేర్ ఖర్చులను ఉద్యోగుల నుంచి వసూలు చేస్తున్నారని, ప్రొజెక్టర్ కెమెరా వంటివి కొనుగోలు చేయించారని, కొనివ్వని కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్మికులను వేధింపులకు గురిచేయడం, అవినీతి, అక్రమాలపై ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేసి మూడు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. కార్మికులు, కింది స్థాయి ఉద్యోగులను చిన్నచిన్న విషయాలకే డిపో స్పేర్‌లో పెట్టి ఆఘమేఘాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకునే యాజమాన్యం.. అధికారుల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment