నాగమడుగు నత్తనడక
భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ
నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన ప్రాంతం
నిజాంసాగర్(జుక్కల్): మంజీర నదిపై చేపట్టిన నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నదిలో కరకట్ట నిర్మించి ఇక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా సాగు నీటిని పిట్లం మండలానికి, అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ మండలాల్లోని చెరువులకు నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో పనులను ప్రారంభించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు నల్లవాగు మత్తడి, కల్యాణి, సింగితం రిజర్వాయర్ వరద నీటి ప్రవాహం కలిసే చోట మంజీర నదిపై చేపట్టిన పనుల కోసం గత ప్రభుత్వం రూ.467.25 కోట్లు మంజూరు చేసింది. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, బిచ్కుంద మండలాల్లోని 40,768 ఎకరాల నాన్‌కమాండ్ ఏరియాకు సాగు నీటి వసతి కల్పించడం నాగమడుగు ఎత్తిపోతల పథకం ముఖ్య ఉద్దేశం. పనులు ప్రారంభమై మూడేళ్లయినా ఇప్పటి వరకు 15 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
అర్ధంతరంగా నిలిచిన కరకట్ట నిర్మాణ పనులు
రబ్బర్‌డ్యాం ఏర్పాటుకు ప్రతిపాదనలు
కొలిక్కిరాని భూ సేకరణ ప్రక్రియ
మూడేళ్లలో 15 శాతం
మించని పనులు
నాగమడుగు ఎత్తిపోతల పథకం కరకట్టతో పాటు పంపుహౌజ్‌లు, గ్రావిటీ కాలువల నిర్మాణానికి 500 ఎకరాల భూములు అవసరమని నీటిపారుదలశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు అవసరమైన భూమిని సేకరించలేదు. ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా పరిహారం దక్కడం లేదని రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఎకరానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒడ్డేపల్లి శివారులో మాత్రం 11.26 గుంటల భూమిని రైతుల నుంచి సేకరించగా ఎకరానికి రూ.17 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు.
ప్రతిపాదనలు పంపాం..
నాగమడుగు ఎత్తిపోతల సేఫ్టీకోసం రబ్బర్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. నాన్‌కమాండ్ ఏరియాకు సాగు నీరందించడంతోపాటు రైతులకు ఇబ్బందులు లేకుండా రబ్బర్ డ్యాం నిర్మాణం చేపట్టేలా చూస్తా.
– లక్ష్మీకాంతారావు, జుక్కల్ ఎమ్మెల్యే
పనులు సాగుతున్నాయి
పంప్‌హౌస్ పనులు కొనసాగుతున్నాయి. భూ సేకరణకు రైతులు సహకరిస్తే గ్రావిటీ పనులు కుడా చేపడుతాం. ఇప్పటి వరకు 15 శాతం పనులు పూర్తి చేయడంతోపాటు రూ.40 కోట్ల బిల్లులు చెల్లించాం.
– శ్రీనివాస్, నీటిపారుదలశాఖ సీఈ
Comments
Please login to add a commentAdd a comment