నాలుగు పథకాలపై ఎన్నో ఆశలు!
● అర్హుల ఎంపిక కోసం
కొనసాగుతున్న సర్వేలు
● లబ్ధి చేకూరుతుందో లేదోనని
జనంలో ఆందోళన
● నేడు ఉమ్మడి జిల్లా అధికారులతో
మంత్రి జూపల్లి సమీక్ష
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డుల జారీపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అర్హులకు లబ్ధి చేకూరుతుందో లేదోనన్న ఆందోళన జనంలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్‌లో నిర్వహించే సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ సమావేశంలో ఆయా పథకాల అమలు విషయంలో ఆయన దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం రోజు నుంచి నాలుగు పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నారు. సర్వే అనంతరం ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి, లబ్ధిదారుల జాబితాను ఆమోదించనున్నారు. 26 నుంచి లబ్ధిదారులకు ఆయా పథకాలను పంపిణీ చేస్తారు. గతేడాది నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో 2.38 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం తొలి విడతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించింది. అర్హులైన పేదలను గుర్తించి వారికి తొలుత ప్రాధాన్యతనిస్తామని పేర్కొంది.
జిల్లాలో రేషన్ కార్డులు లేని పేదలు వేలాది మంది ఉన్నారు. అయితే గతంలో రేషన్‌కార్డులకో సం వచ్చిన 21,842 దరఖాస్తులను అధికారులు ప రిశీలిస్తున్నారు. కాగా కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చ డం కోసం ఏళ్ల తరబడిగా జనం ఎదురుచూస్తున్నా రు. పేర్ల చేర్పుకోసం పదేళ్లలో 60 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త సభ్యుల పేర్లు చేర్చితే వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.
రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన ప్రభుత్వం.. ఎకరానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ఇటీవలే ప్రకటించింది. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతుభరోసా ఇస్తామని స్పష్టం చేసింది. గతంలో జిల్లాలో దాదాపు 3 లక్షల మంది రైతులకు ఒక్కో సీజన్‌లో రూ. 260 కోట్లు రైతుబంధు వచ్చింది. ఈసారి ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతుభరోసా ఇవ్వొద్దని నిర్ణయించిన నేపథ్యంలో 30 వేల ఎకరాల మేర తగ్గవచ్చని భావస్తున్నారు.
రైతు ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఉపాధి హామీ పథకంలో 20 రోజులకు తక్కువ కాకుండా పనిచేసిన కుటుంబాలకు రైతు ఆత్మీయ భరోసా ఇస్తామని పేర్కొంది. జిల్లాలో 20 వేలకుపైగా కుటుంబాలకు లబ్ధి చేకూరవచ్చని భావిస్తున్నారు. వాస్తవంగా వ్యవసాయ భూమి లేని పేదలు చాలా మంది ఉన్నారు. ఉపాధి హామీని ప్రామాణికంగా తీసుకోవడంతో చాలా మంది పేద కూలీలకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం లేకపోవడంతో ఆయా గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం లేదు. దీంతో తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు దక్కేనా?
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక విష యంలో తమకు న్యాయం జరుగుతుందో లేదో నన్న ఆందోళన పేద కుటుంబాల్లో నెలకొంది. దశాబ్దాలుగా ఇళ్ల కోసం, రేషన్‌కార్డుల కోసం తిరుగుతున్న వారంతా ఈసారి తమకు పథకా లు దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సర్వే తీరును చూస్తుంటే అర్హులకు లబ్ధి చేకూరే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. అధికార పార్టీ నేతలు నిర్ణయించిన వారికే లబ్ధి చేకూరుతుందేమోనని చాలామంది భయపడుతున్నారు. పేదలకు ఆయా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలని కోరుతున్నారు.
‘పక్కాగా వివరాలు సమర్పించండి’
కామారెడ్డి రూరల్: రైతు భరోసా సర్వేను పక్కా గా నిర్వహించి, వివరాలను నమోదు చేయాల ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన క్యాసంపల్లిలో సర్వే నంబర్ 330, 331, 332, 333 లలో గల 58 ఎకరాల భూముల వివరాలను పరిశీలించారు. ఇందు లో 30 ఎకరాల భూమి లే ఔట్ చేసి ఉందని, మిగతా 28 ఎకరాలలో పంటలు సాగవుతున్నా యని అధికారులు తెలిపారు. సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించి, వివరాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట ఆర్డీవో రంగనాథ్‌రావు, డీఏవో తిరుమల ప్రసాద్, తహసీల్దార్ జనార్దన్, ఏడీఏ అపర్ణ, ఏఈవోలు తేజస్విని, దేవేంద్ర, ప్రతిమ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment