పిక్కలు తీస్తున్న కుక్కలు
● బయటకొస్తే భయం.. భయం
● పెరుగుతున్న కుక్కల దాడులు
● బాధితుల్లో పిల్లలే అధికం
● నియంత్రణ లేక స్వైర విహారం
కరీంనగర్‌టౌన్: జిల్లాలో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. గ్రామాలు, కాలనీల్లో గుంపులు సంచరిస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. చిన్నారులతో పాటు దారిగుండా వెళ్లేవారిపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా కరీంనగర్ సిటీలోని పలు కాలనీల్లో చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తూ.. పిక్కలు తీస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రుల పాలవుతున్న వారిసంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. వీటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ సమస్య తీవ్రం..
జిల్లాకేంద్రంలోని బోయవాడ, ప్రకాశం గంజ్, గణేశ్‌నగర్, హనుమాన్‌నగర్, భగత్‌నగర్, హౌజింగ్‌బోర్డుకాలనీ, కాపువాడ, కిసాన్‌నగర్, సుభాస్‌నగర్, వావిలాలపల్లి, రాంనగర్, సప్తగిరికాలనీ, గౌతమినగర్, కట్టరాంపూర్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాల్లో శునకాల సమస్య తీవ్రంగా ఉంది. వీటి దాడితో ఆసుపత్రిల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తీవ్రంగా గాయపరస్తుండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఎటువైపు నుంచి శునకాలు వస్తాయో దాడి చేస్తాయనో భయందోళనకు గురవుతున్నారు. శునకాల దాడులను నివారించేందుకు సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.
గుంపులు గుంపులుగా సంచారం...
జిల్లాకేంద్రంతో పాటు గ్రామాల్లో చికెన్, మటన్ దుకాణాల సంఖ్య పెరగడంతో కుక్కలు వీటి చుట్టూ తచ్చాడుతున్నాయి. కుక్కలు ఆయా ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో.. వాటిని చూస్తే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్లాలంటే ఒకరిద్దరూ కలిసి తోడుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో కుక్కకాటు కేసులు ఇలా
జనవరి 750
ఫిబ్రవరి 851
మార్చి 789
ఏప్రిల్ 576
మే 694
జూన్ 870
జూలై 453 (11వ తేదీ వరకు)
ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలుడు మల్యాల శ్రీమాన్. 49వ డివిజన్ బోయవాడ నివాసి. బుధవారం ఇంటినుంచి బయటకు రాగా ఒక కుక్క వెంటపడి ఒంటిపై నాలుగైదు ప్రాంతాల్లో కరిచింది. స్థానికులు అడ్డుకోవడంతో వదిలి వెళ్లింది. ఇదే ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల అంతగిరి విశ్వనాథ్, 17 సంవత్సరాల పూజితను కూడా కుక్కలు తీవ్రంగా కరిచాయి. మంగళ, గురువారాల్లో హనుమాన్‌నగర్‌లో ఓ కుక్క ఎనిమిది మందిని కరిచింది. వీరందరూ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధితులు పెరుగుతున్నారు
ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కుక్కకాటు బాధితులు ఆసుపత్రికి ఎక్కువగా వస్తున్నారు. వీరందరికి వైద్యం అందిస్తున్నాం. మందులు, వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాం. కుక్కకాటు వేసిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలి.
– డాక్టర్ వీరారెడ్డి, ప్రభుత్వ ప్రధానాసుపత్రి సూపరింటెండెంట్ , కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment