● కాంగ్రెస్‌లో మైనార్టీల కినుక
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల రగడ మొదలైంది. ఇప్పుడిప్పుడే నామినేటెడ్ పదవుల పందేరం ప్రారంభమవగా, ఆదిలోనే హంసపాదు అన్న తరహాలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు పక్కనపెడితే, జిల్లాస్థాయి పదవులకు స్థానిక నాయకుల నుంచి పోటీతీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వెలువడుతున్న నామినేటెడ్ పదవులపైనా పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట ఉన్న తమకు నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కడం లేదంటూ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. తాజాగా నియమించిన అర్బన్‌బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీలో గతంలో ఉన్న ఇద్దరిని తొలగించడం వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీని గతేడాది సెప్టెంబర్ 8వ తేదీన మొదటి సారిగా నియమించారు. అందులో 11 మంది కాంగ్రెస్ నాయకులకు కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ నెల 15వ తేదీన అధికారులతో సంబంధం లేకుండా 13 మందితో అర్బన్ బ్యాంక్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి కమిటీలో ఉన్న మహమ్మద్ ఖలీం, బీరం ఆంజనేయులును తొలగించగా, రెండో జాబితాలో ముద్దసాని క్రాంతి, బొమ్మరాతి సాయికృష్ణ, నాగుల సతీ ష్, మార్క రాజులకు చోటు కల్పించారు. అయితే మహమ్మద్ ఖలీంను తొలగించడంపై పార్టీ మైనా ర్టీలు గుర్రుగా ఉన్నారు. పదిహేను సంవత్సరాలు గా పార్టీకి సేవలందిస్తూ వస్తున్న మహమ్మద్ ఖలీంకు అన్యాయం చేశారంటూ వారు మండిపడుతున్నారు. కొత్తగా పదవులు ఇవ్వాల్సింది పోయి, ఉన్న పోస్టులు కూడా తీసేయడమేమిటని ఆవేదన చెందుతున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి పార్టీ లోకి వచ్చిన వాళ్లకు అవకాశం ఎలా ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీ సభ్యుడిగా ఖలీంను తొలగించడం కాంగ్రెస్ పార్టీలో వివాదంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment