గణతంరరత్ర వేడుకలకు ఏర్పాట్లు
కరీంనగర్: ఈ నెల 26న జిల్లాకేంద్రంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. స్టేజీ, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, అలంకరణ తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో వేడుకలకు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఈ నెల 24వ తేదీన జరగనున్న ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని మేయర్ వై.సునీల్‌రావు ఆదేశించారు. నగరంలోని మల్టీపర్పస్ పార్క్, అంబేడ్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను శనివారం పరిశీలించారు. రూ.13 కోట్లతో సుందరీకరించిన మల్టీపర్పస్ పార్క్ 24వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందన్నారు. అంబేడ్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈ–క్లాస్‌రూమ్స్, ప్రతిష్టాత్మక 24/7 తాగునీటి సరఫరా తదితర ప్రాజెక్ట్‌లను 24వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవాల అనంతరం హౌసింగ్‌బోర్డుకాలనీలో నిర్వహించనున్న సభకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. నగరపాలకసంస్థ ఈఈ యాదగిరి, డీఈ అయూబ్ ఖాన్, ఏఈలు, ఏజెన్సీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
20 నుంచి సన్నాల మిల్లింగ్
కరీంనగర్‌రూరల్: రైసుమిల్లుల్లో ఈ నెల 20నుంచి సీఎంఆర్(కస్టమ్స్‌మిల్లింగ్‌రైస్) కోసం సన్నరకం ధాన్యం మిల్లింగ్ ప్రారంభించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జి.నర్సింగరావు పేర్కొన్నారు. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లోని రెండు రైసుమిల్లులను తనిఖీ చేశారు. వానాకాలం సీజన్‌లో సీఎంఆర్ కింద ఆయా మిల్లులకు కేటా యించిన దొడ్డు, సన్నరకం ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం నుంచి సన్నరకం ధాన్యం మిల్లింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైసుమిల్లర్లు ఎస్. వెంకటేశ్వర్లు, టి.మల్లారెడ్డికి సూచించారు.
20న స్టాల్స్ కేటాయింపు
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలోని పద్మనగర్ బుల్‌సెమెన్ వద్ద నిర్మించిన సమీకృత మార్కెట్ స్టాల్స్,దుకాణాలను అద్దె ప్రాతిపదికన ఈ నెల 20వ తేదీన లాటరీ ద్వారా కేటాయిస్తామని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల కాలపరిమితి కోసం స్టాల్స్,దుకాణాలను కేటాయించేందుకు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించినట్లు చెప్పారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా, ముందుగా ఈ నెల 21వ తేదీన లాటరీ ద్వారా కేటాయించాలని అనుకున్నామన్నారు. రేషన్‌కార్డులకు సంబంధించి ఈ నెల 21,22 తేదీల్లో గ్రామసభలు ఏర్పాటు చేయడంతో, కేటాయింపును ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళాభారతిలో సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే స్టాళ్లు, దుకాణాల కేటాయింపనకు దరఖాస్తుదారులు హాజరు కావాలని సూచించారు.
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రవేశ పరీ క్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,806 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,064 మంది హాజరయ్యారు. పరీక్ష విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందికి జేఎన్‌వీ ప్రిన్సిపాల్ మంగతాయారు కృతజ్ఞతలు తెలిపారు. చొప్పదండి, ధర్మపురిలలో ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆమె సందర్శించారు. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment