ఖాకీ కిడ్స్‌తో సైబర్ నేరాలకు చెక్
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: సైబర్ నేరాలను అదుపు చేసేందుకు జిల్లా పోలీస్‌శాఖ ఖాకీ కిడ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సైబర్‌నేరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో శనివారం సైబర్ నేరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కలిగించే ‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సైబర్‌నేరాలు పెరుగుతున్నాయని, వీటిపై విద్యార్థులు తల్లిదండ్రులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘ఖాకీ కిడ్స్’కు ఎస్పీ శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, పిల్లలు చెబితే తల్లిదండ్రులు తప్పకుండా వింటారనే ఉద్దేశంతోనే ఖాకీ కిడ్స్‌ను ప్రారంభించామని వివరించారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లోని సైబర్ వారియర్లకు సైబర్ నేరాలు జరిగే విధానం, ఎలా అరికట్టాలి, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత గోప్యత పాటించాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియోకాల్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప, సీఐలు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్‌ఐలు మధుకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment