జాతీయస్థాయిలో విజేతగా నిలవాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచేందుకు కృషి చేయాలని కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బాలుర హ్యాండ్‌బాల్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. హ్యాండ్‌బాల్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర, జిల్లా అసోసియేషన్‌లను అభినందించారు. రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ మాట్లాడుతూ, ఈ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను జాతీయస్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బసవని లక్ష్మణ్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో మూడురోజులపాటు పోటీలు నిర్వహిస్తామని, 10 ఉమ్మడి జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు పాల్గొంటారని, వీరికి ఉచిత వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం అతిథులు పోటీలను ప్రారంభించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, డీవైఎస్‌వో వి.శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పరిశీలకులు దీపక్‌ప్రసాద్, జుంజుపల్లి వివేక్, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆనంద్‌కుమార్, నెమలికొండ ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్, సంఘం కోశాధికారి కనకయ్య, రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘ రెఫ్రిస్ బోర్డ్ కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ మేయర్ సునీల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment