వైభవంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఐదు రోజులపాటు నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజస్వామి చిత్రపటాన్ని నగర సంకీర్తన ద్వారా పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం త్యాగరాజస్వామి జీవిత విశేషాలను ఎన్.నర్సయ్య వివరించగా, శ్రీవిద్య, కృష్ణవేణి బృందం పంచరత్నగానం, అభిరామ్ వయోలిన్ కచేరీ, ప్రియ సిస్టర్స్ సంగీత కచేరీ, భోగధర్మరాజు బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన, జయంతి భాగవతారిణి హరికథగానం అలరించాయి.
ఆరాధనోత్సవాలు నిర్వహించడం గర్వకారణం
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించుకోవడం వేములవాడ ప్రాంతానికే గర్వకారణమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ ఓపెన్‌స్లాబ్‌లో శనివారం ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. అంతరించి పోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం చైర్మన్ చాంబర్‌లో మహాశివరాత్రి జాతర ఉత్సవాల నిర్వహణపై ఈవో వినోద్‌రెడ్డి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్‌లతో చర్చించారు. సమన్వయ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈవో వినోద్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కౌన్సిలర్ ఇప్పపూల అజయ్, ఏఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా దర్శించుకున్న భక్తులు
రాజన్నను 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాల మొక్కులు చెల్లించుకున్నారు. ఆది, సోమవారాలు అభిషేకాలు రద్దు చేశారు.
ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment