ఆరోగ్యశ్రీ అందక అవస్థలు
బాధాకరం
ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయడం బాధాకరం. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా అమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చి ఆరోగ్యశ్రీ నిలిపివేసినట్లు తెలియడంతో మరో ఆసుపత్రికి తీసుకెళుతున్నాం. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– రాజశేఖర్, లంబాడిపల్లి, చిగురుమామిడి
బకాయిల భారంతోనే
ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెరిగిపోయాయి. వేతనాలు, మెయింటెనెన్స్ కష్టంగా మారడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే నిర్ణయం తీసుకున్నాం. ప్యాకేజీలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని పెంచాలి. రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు తగ్గించాలి. ట్రేడ్‌లైసెన్స్‌ల పద్ధతి తొలగించాలి.
– విష్ణువర్దన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్
ఆస్పత్రుల అధ్యక్షుడు, కరీంనగర్
కరీంనగర్‌టౌన్: ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతోనే సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. మూడు రోజులుగా సేవలు నిలిచిపోవడంతో అత్యవసర రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండె సమస్యలు, అపెండిసైటిస్ లాంటి అత్యవసర వైద్యసేవలకు అవస్థలుపడే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 49 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. అందులో 32 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రులు, ఆపోలోరీచ్ మినహా అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. దీంతో రోగుల ప్రైవేటు బోధనాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతీ రోజు సుమారు 70మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందేవారు. ఆసుపత్రులు సేవలు నిలిపివేయడంతో ప్రభుత్వ తీరు, ఆసుపత్రుల వ్యవహారశైలిపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడిజిల్లాలో నెట్‌వర్క్ సేవలు బంద్ బోధనాస్పత్రులకు పరుగు తీస్తున్న రోగులు
ఈ మహిళ పేరు జీల కేతవ్వ. చిగురుమామిడి మండలం లంబాడిపల్లి. తన కుమారుడి బైక్‌పై వెళ్తుండగా సుందరగిరి ప్రాంతంలో మిషన్‌భగీరథ కోసం తవ్విన గుంతలో బైక్ పడింది. ఈ ప్రమాదంలో కేతవ్వకు రెండు కాళ్లు విరిగాయి. ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయించేందుకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు తమవద్ద ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక ఆరోగ్యశ్రీ వర్తించే ప్రైవేటు మెడికల్ కళాశాలకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment