ప్రేమించాలి కానీ.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమించాలి కానీ..

Published Sun, Jan 19 2025 12:50 AM | Last Updated on Sun, Jan 19 2025 12:49 AM

ప్రేమ

ప్రేమించాలి కానీ..

గారాబం వద్దు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన బీటెక్‌ చదివే కుర్రాడు బైక్‌ కొని వ్వాలని తల్లిదండ్రులను కోరాడు. చదువు పూర్తయిన తరువాత కొనిస్తామని చెప్పినా వినలేదు. మనస్తాపానికి గురై ఇటీవల గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కరీంనగర్‌ జిల్లాకేంద్రానికి చెందిన బాలుడికి చిన్నతనం నుంచి ఖరీదైన బైక్‌లపై తిరగడం అంటే ఇష్టం. కొద్దిరోజుల క్రితం ఓ ఖరీదైన బైక్‌పై అర్ధరాత్రి నగరంలోని గల్లీలో వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌స్తంభాన్ని ఢీకొని చనిపోయాడు. ఎప్పుడైనా అర్ధరాత్రి తరువాత ఇంటికొస్తాడని భావించి నిద్రపోయిన ఆ తల్లిదండ్రులకు అతని మరణవార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఇటీవల పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌కు చెందిన హన్మంతు అనే మరో పదిహేనేళ్ల బాలుడు బైక్‌ యాక్సిడెంట్లో మృత్యువాత పడ్డాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి బస్టాండ్‌ సమీపంలో డిసెంబర్‌ 18న బాలుడి నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా ఓ వృద్ధుడు చనిపోయాడు. మైనర్‌కు బైక్‌ ఇచ్చిన పాపానికి తల్లిని రిమాండ్‌కు, కొడుకుని జువైనైల్‌ హోమ్‌కు తరలించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు సుమారు 350 మందిని పిలిపించి ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కౌన్సెలింగ్‌ చేశారు. ఇకపై మైనర్ల వాహనాలతో జరిగే ప్రమాదాలు అన్నింటికీ తల్లిదండ్రులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఆర్థిక వివరాలు చెప్పాలి

పిల్లలు అడిగినవన్నీ కొనివ్వడం వంటి అతి గారాబం చేయడం మంచిది కాదు. ఖర్చుపెట్టే స్థోమత ఉన్నప్పటికీ డబ్బు విలువ తెలిసేలా విలువలు నేర్పించాలి. పిల్లలు ప్రతీ విషయాన్ని ఈజీగా తీసుకోకుండా ఆలోచన విధానం మార్చాలి. ఫైనాన్స్‌ డిసిప్లేన్‌ నేర్పిస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే.

– మార్కొండ శకుంతల,

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎకనామిక్స్‌

చాలెంజ్‌గా మారింది

తల్లిదండ్రులు పిల్లలపై అతిగా స్పందించవద్దు. పిల్లలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు ఏవిధంగానైతే వారు చెప్పినట్లు వింటారో అదే ధోరణిని పాటిస్తారు. పిల్లల మానసిక ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. చిన్న వస్తువులను దక్కించుకునేందుకు వారు మొండిగా వ్యవహరిస్తున్నారంటే పెద్దయ్యాక అలాగే ప్రవర్తిస్తారు. అతిగా ప్రవర్తించే పిల్లల విషయంలో అవసరమైతే కౌన్సెలింగ్‌ తీసుకోవాలి.

– ప్రవీణ్‌కుమార్‌ మన్నా, సైకియాట్రిస్టు

మొండితనం పెరుగుతోంది

పిల్లలను గారాబం చేయడం వల్ల వారిలో మొండితనం పెరుగుతుంది. అవసరానికి మించిన డబ్బులు ఇస్తూ వారిని తల్లిదండ్రులే దారితప్పేలా చేయడం సరికాదు. పిల్లలతో స్నేహంగా ఉంటూనే వారిని గమనిస్తూ ఉండాలి. వారుచేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ఇది సరైనది కాదని చెప్పగలిగితే వారి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటారు.

– త్రివేణి, పేరెంట్‌, కరీంనగర్‌

‘ఇంటర్‌ పూర్తయ్యింది. మూడేళ్లు కష్టపడితే డిగ్రీ పూర్తి అవుతుంది. భవిష్యత్‌ బాగుంటుంది. జీవితంలో మంచిగా స్థిరపడొచ్చు. అనవసరంగా తిరిగి ఆగం కావొద్దు కొడుకా’ అని తల్లిదండ్రులు మందలించినందుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ఇద్దరు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.

అడిగిందల్లా వద్దు.. అవసరమైంది మాత్రమే

● పిల్లలు అడిగిన ప్రతిదాన్నీ సమకూర్చడం ఉత్తమ పేరెంటింగ్‌ లక్షణంగా భావిస్తున్న తల్లిదండ్రులకు ప్రస్తుతకాలంలో కొదవలేదు. కోరింది కొనివ్వకపోతే కొంత సేపే ఏడుస్తారు. సంస్కారం అందించకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారని గుర్తిస్తే మంచిది.

● చాలా మంది ఫిర్యాదు ఏమిటంటే మా పిల్లలు చెపితే వినడం లేదండీ అని.. నిజమే పిల్లలు చెపితే వినరు.. మనం చేసినట్లు చేస్తారు. చూసి నేర్చుకుంటారు. వద్దని వారించాలనుకునే ఏ విషయం అయినా సరే పెద్దవాళ్లుగా మనం ఆచరిస్తే చాలు అది చూసి వాళ్లే నేర్చుకుంటారు.

● అంతే కానీ పెద్దరికం పేరుతో ఏది చెపితే అది వినాలని పంతం పనికి రాదు. నచ్చచెప్పడం, నచ్చేలా చెప్పడం, నచ్చేవరకు చెప్పడం పెద్దల కర్తవ్యం కావాలి. అదీ బాధ్యతాయుతమైన పెంపకం అంటే.

● మేం పడ్డ కష్టం పిల్లలు పడకూడదని కడుపు కట్టుకుని డబ్బు సంపాదనే లక్ష్యంగా పెద్దవాళ్ల వ్యవహారం నడుస్తోందిప్పుడు. పిల్లల్ని కష్టపడకుండా పెంచాలనుకోవడమే పెద్దస్వార్థం. కష్టపెట్టకుండా కాదు కష్టం విలువ తెలిసేలా పెంచడం చాలా ముఖ్యం.

● ఏదో పని చేస్తే తప్ప పిల్లలకు డబ్బులు ఇవ్వకూడదు. ఉచితంగా వచ్చే డబ్బు సోమరితనాన్ని పెంచుతుంది. పెంకితనాన్ని పెంచుతుంది. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచన కలిగిస్తుంది.

● ఆండ్రాయిడ్‌ ఫోన్లు అందరి ఇళ్లల్లో ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు కూడా బాగా పెరిగాయి. అవసరం ఉన్నా, లేకపోయినా ఆఫర్లున్నాయనే సాకుతో పనికి రాని వస్తువులను కొనుగోలు చేసి డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసే సంస్కృతి పెరిగిపోయింది. ఫ్రీగా వచ్చినా సరే అవసరం లేని వస్తువుల కొనుగోళ్లపైన నియంత్రణ ఉండాలి. ఆఫర్ల పేరుతో ప్రస్తుతానికి అవసరం లేని ఏ ప్రొడక్ట్స్‌ జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం.

పిల్లలపై అతి గారాబం ప్రేమ కానే కాదు కష్టం విలువ తెలిసేలా పెంచాలి పొదుపు పాఠాలతోపాటు ఖర్చులపై నియంత్రణ నేర్పాలి అప్పుడే వారికి బంగారు భవిష్యత్‌

కరీంనగర్‌ టౌన్‌/సిరిసిల్లకల్చరల్‌:

కొడుకు అడుగుతున్నాడని ఆలోచన లేని నిర్ణయాలు తీసుకోవద్దు. కూతురు అలుగుతోందని అడిగిందల్లా కొనివ్వొద్దు. చదువుతున్నారు కదా అని ఏమరుపాటుగా ఉండొద్దు. చదవడం లేదని ఎప్పుడూ వెంటపడొద్దు. ఇంటికి ఎప్పుడొస్తున్నారు.. ఎప్పుడెళ్తున్నారో గమనించాలి. ప్రస్తుతకాలంలో పిల్లలతో స్నేహంగా ఉండాలి కానీ.. వారిపై అతిప్రేమ ప్రమాదకరంగా మారుతోంది. అన్ని విషయాల్లో సరే అని కొన్ని సందర్భాల్లో కుదరదంటే వారి మనసు నొచ్చుకుంటోంది. వద్దు అనే పదం వారి ప్రాణాలకు ముప్పు తెస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీనేజీ యువత కొందరు ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటుండగా... చేతికి అందివచ్చిన పిల్లలు కానరాని లోకాలకు చేరడంతో ఆయా తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతోంది.

కాలం మారుతోంది..

కాలం మారుతోంది. దాంతో పాటు పిల్లల్లో ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. ప్రతీ అంశాన్ని త్వరగా స్వీకరించడంతో పాటు దానిపై నెగెటివ్‌ ఆలోచన చేయడంలో ముందుంటున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఆలోచన ధోరణిని గమనిస్తూ, అలవాట్లపై శ్రద్ధ చూపాలి. సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని, బైక్‌ కావాలని, కోరింది కొనివ్వడం లేదనే కారణాలతో పసిపిల్లలు, యుక్త వయసుగల వాళ్లు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ కోరికలను తీర్చుకునే క్రమంలో ఎంతకై నా తెగిస్తున్నారు. ఈ విషయాల్లో కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. వారికి ఏదీ అవసరం.. ఏది అనవసరం అనేది కూర్చోబెట్టుకుని వివరించే ప్రయత్నం చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రేమించాలి కానీ..1
1/3

ప్రేమించాలి కానీ..

ప్రేమించాలి కానీ..2
2/3

ప్రేమించాలి కానీ..

ప్రేమించాలి కానీ..3
3/3

ప్రేమించాలి కానీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement