సర్వేకు అంతా సిద్ధం
● కులగణనకు మారిన షెడ్యూల్ ● జిల్లాలో 9 నుంచి ఇంటింటి సర్వే ● మొత్తం 2,90,657 కుటుంబాలు ● ప్రత్యేకాధికారుల నియామకం ● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా ఆర్వీ కర్ణన్
కరీంనగర్ అర్బన్: కులగణన షెడ్యూల్ మారింది. ఈ నెల 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా 9 నుంచి చేపట్టనున్నారు. ఎన్యుమరేటర్లుగా టీచర్లను తీసుకునే ప్రక్రియలో జరిగిన జాప్యమే ఇందుకు కారణం. 6, 7, 8 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ నిర్వహించనుండగా శుక్రవారం బ్లాక్‌ల సంఖ్యపై స్పష్టత రానుంది. గత గణాంకాల ప్రకారం 1,984 బ్లాక్‌లుగా నివాసాలను విభజించి, జనగణన నిర్వహించారు. ఈసారి కుటుంబాల సంఖ్య ఆధారంగా బ్లాక్‌లను ఏర్పాటు చేయనుండగా హౌస్ లిస్టింగ్‌లో కుటుంబాల వారీగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబాల సంఖ్యపై స్పష్టత రానుండగా బ్లాక్‌ల సంఖ్య పెరగనుందని సమాచారం.
ఎస్జీటీలకు శిక్షణ..
ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులు మినహా ఇతర సిబ్బందిని నియమించాలని తొలుత ప్రభుత్వం సూచించింది. కానీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది సరిపడా లేకపోవడంతో టీచర్లను కూడా ఎన్యుమరేటర్లుగా నియమించాలని ఆదేశించింది. దీంతో ఎస్జీటీలకు సర్వేపై సోమవారం శిక్షణనిచ్చారు. 2011లో 2,90,657 కుటుంబాలుండగా బుధవారం నుంచి శుక్రవారం వరకు కుటుంబాల వారీగా హౌస్ లిస్టింగ్ చేయనున్నారు. ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటించనుండగా 2,500లకు పైగా బ్లాక్‌లు వచ్చే అవకాశాలున్నాయని తెలిసింది.
కలెక్టర్ ప్రత్యేక చర్యలు..
కులగణన పక్కాగా జరిగేలా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నోడల్ అధి కారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వ్యవహరిస్తుండగా ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆర్వీ కర్ణన్‌ను ప్రభుత్వం నియమించింది. ఒక ఎన్యుమరేటర్‌కు 150 కుటుంబాలు కేటాయించారు. ప్రతీ 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉండనుండగా తహసీల్దార్, డీటీ, పంచాయతీరాజ్, డీఆర్డీఏ అధికారులను, మండలానికో ప్రత్యేక అధికారిగా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులను నియమించారు. కాగా, సమగ్ర సర్వేకు అంతా సిద్ధమైనట్లు జిల్లా అధికా రులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment