10న కోర్టు నూతన భవన సముదాయానికి శంకుస్థాపన
● హాజరుకానున్న హైకోర్టు సీజే అలోక్ అరాధే, పలువురు జడ్జిలు
కరీంనగర్ క్రైం: జిల్లా కేంద్రంలో ఈ నెల 10న నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవన సముదాయానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శంకుస్థాపన చేయనున్నారు. న్యాయమూర్తుల కోసం నూతనంగా నిర్మించనున్న నివాస భవనాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు కోర్టు వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రస్తు తం ఉన్న కోర్టు భవన సముదాయం నూతన కోర్టుల ఏర్పాటుతో సరిపోకపోవడం, సౌకర్యాలు తక్కువగా ఉండటంతో రూ.86 కోట్లతో నూతన నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న న్యాయమూర్తుల నివాస భవనాలు సరిపోకపోవడం, కొన్ని అసౌకర్యంగా ఉండటంతో సీతారాంపూర్ రోడ్‌లోని పాత రెవెన్యూ నివాస భవనాల ప్రాంతంలో ఎకరా 26 గుంటల్లో రూ.26 కోట్లతో 20 కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి సీజేతోపాటు హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్, హైకోర్టు ఇతర న్యాయమూర్తులు జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, జస్టిస్ ఎన్‌వీ.శ్రవణ్‌కుమార్, జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ జె.శ్రీనివాసరావు హాజరవుతారని జిల్లా జడ్జి బి.ప్రతిమ, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్ పేర్కొన్నారు.
కళాభారతికి పూర్వవైభవం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని కళాభారతికి పూర్వవైభవం తీసుకువస్తామని మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. బుధవారం కళాభారతి మరమ్మతులను పరిశీలించారు. కళలు, కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆధునీకరణ పనులు చేపడుతున్నామని, ఇక్కడ మళ్లీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలా చూస్తామన్నారు. ఎస్సారార్ కళాశాల ఆవరణలో అమతవర్షిణి ఆడిటోరియం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాభారతిలో అధునాతన పద్ధతిలో స్టేజీ నిర్మాణం, 400 కెపాసిటీతో సీటింగ్ తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మేకప్ గది ఆధునీకరణ, గతంలో ఉన్న ఏసీలను వినియోగంలోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనంగా నిధులు కేటాయించాలని కలెక్టర్‌ను కోరతామన్నారు. సరిపోకపోతే నగరపాలిక నుంచి కూడా వెచ్చిస్తామన్నారు. నగరపాలక సంస్థ ఈఈ యాదగిరి తదితరులున్నారు.
క్రీడాకారులు
నిత్యం సాధన చేయాలి
కరీంనగర్ స్పోర్ట్స్: నిత్య సాధనతో క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తారని డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి అండర్–14, 17 బాలుర రెజ్లింగ్ ఎంపిక పోటీలను బుధవారం ప్రారంభించారు. రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాకు క్రీడలపరంగా మంచి పేరు ందని, దాన్ని కొనసాగించేందుకు క్రీడాకారులు శ్రమించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 100 మంది క్రీడాకారులు హా జరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారిని ఈ నె ల 8 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, ఫిజికల్ డైరెక్టర్లు శంకరయ్య, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల రక్షణే షీటీం లక్ష్యం●
కరీంనగర్ క్రైం: మహిళల రక్షణే లక్ష్యంగా షీటీం పని చేస్తోందని షీటీం ఇన్‌చార్జి, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీలత అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని రాంనగర్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు, పనిచేసే ప్రదేశాల వద్ద మహిళలు వేధింపులకు గురైతే షీటీం పోలీసులను ఆశ్రయించాలని, సత్వర న్యాయం చేస్తామని తెలిపారు. నేరుగా సంప్రదించలేనివారు 87126 70759 నంబర్‌కు లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment