ధాన్యం సేకరణపై నిరంతర పర్యవేక్షణ
● కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉండొద్దు ● తెలంగాణ బియ్యానికి ఇతర ప్రాంతాల్లో డిమాండ్ ● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. పంటను తూకం వేసిన తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు. సన్న రకాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని, రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకొని నష్టపోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. రోజూ కేంద్రాలను సందర్శిస్తూ సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. సన్న రకం ధాన్యాన్ని గుర్తించేందుకు కొనుగోలు కేంద్రానికి ఒకటి చొప్పున గ్రెయిన్ కాలిపర్ యంత్రం అందించాలన్నారు. తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ తదితర రకాల బియ్యానికి ఇతర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
జిల్లాలో 340 కేంద్రాలు
జిల్లా రైతులు వానాకాలంలో 55 శాతం దొడ్డు రకం, 45 శాతం సన్న రకాలు సాగు చేశారని కలెక్టర్ పమేలా సత్పతి వివరించారు. 340 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 1,23,000 టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, జిల్లా సహకార అధికారి రామానుజాచారి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సివిల్ సప్లై అధికారి నర్సింగరావు, మేనేజర్ ఎం.రజనీకాంత్, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
రైస్‌మిల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్.. రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను సభ్యులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గన్నీ సంచుల కొరత తీర్చడంతోపాటు బాయిల్డ్ రైస్ మిల్లింగ్ చార్జీలు పెంచాలని కమిషనర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment