జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో వేలంపాటలో నిర్ణయించిన ధరలు అమలు కావడం లేదు. మిల్లర్లు రేటు తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో, ఓవైపు అనుకున్న దిగుబడి రాక, మరోవైపు సరైన ధర లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు మార్కెట్‌లో నిర్ణయించిన ధరలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అమ్మకం..
డబ్బులు అత్యవసరమైన రైతులు పత్తిని విక్రయించేందుకు ప్రైవేటు వ్యాపారుల వైపు చూస్తున్నారు. కొందరు కౌలుకు తీసుకోవడం, పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో అమ్మకాలు సాగిస్తున్న క్రమంలో మిల్లర్లు అందినకాడికి దండుకునే తంతు మొదలు పెట్టారు. మిల్లుల్లో పత్తికి తేమశాతం, నాణ్యత లేదంటూ క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.400 వరకు ధర తగ్గిస్తున్నారు. అన్నదాతలకు ఏం చేయాలో తెలియక వారు చెప్పిన రేటుకే పత్తిని ఇచ్చేస్తున్నారు. అధికారులు సీసీఐకి అమ్ముకోవాలని సూచిస్తున్నా తమ అవసరాల కోసం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండో పెద్ద మార్కెట్..
జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్ ఉత్తర తెలంగాణలో రెండో పెద్ద మార్కెట్. ఇక్కడికి మూడు జిల్లాలు, 20 మండలాలకు చెందిన రైతులు ఇక్కడికి పత్తిని తీసుకువస్తుంటారు. జమ్మికుంట పట్టణంలో 9 జిన్నింగ్ మిల్లులు ఉండగా, ఏడింటిని సీసీఐ కేంద్రాలకు నోటిఫై చేశారు. దీంతో మిల్లర్ల మధ్య పోటీతత్వం లేకుండా మిల్లుల్లో జిన్నింగ్‌కు కావాల్సిన పత్తి దొరుకుతుంది. అయితే, వేలంపాటలో నిర్ణయించిన ధరలు మార్చకుండా అధికారులు చర్యలు తీసుకుంటే రైతులకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తగ్గించింది ఒకరు.. నోటీసులు మరొకరికి..
పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం, జొన్నల మల్యాలకు చెందిన రైతు మడెత్తుల సతీశ్ ఈ నెల 10న పత్తిని జమ్మికుంటకు తీసుకువచ్చాడు. ధరలో తేడాలపై ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. అయితే, మంజునాథ మిల్లు యజమాని ధర తగ్గిస్తే మార్కెట్ అధికారులు మాత్రం అడ్తిదారుకు నోటీసులు జారీ చేశారు. అడ్తిదారుకు తెలియకుండా ధర తగ్గిస్తున్న మిల్లు యజమానిపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment