కొండంతా రాతి విగ్రహాలే
రామగుండం: నగర సమీపంలోని కొండపై శ్రీరామునిగుండాలు.. శ్రీరామపాదక్షేత్రం ఆధ్యాత్మిక, చారిత్రక ఆనవాళ్లుగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా ప్రత్యక్షమవుతున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీరాముడు–సీతాదేవి నడయాడిన నేలగా పిలుచుకునే ఈ ప్రాంతం వారు వనవాసం చేసిన ఆనవాళ్లు కూడా కొండపై ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం శ్రీవేంకటేశ్వస్వామి రాత్రి విగ్రహం వెలుగుచూడడంతో శ్రీరామపాదక్షేత్రంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి నేటివరకు పలుచోట్ల గణపతి, హనుమాన్ తదితర దేవతా రాతి విగ్రహాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కొండమీద రాళ్లపై చెక్కిన శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
మేకల కాపరికి కనిపించిన విగ్రహం..
2006 ఏప్రిల్‌లో ఓ మేకల కాపరి కొండపై మేకలు మేపడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే శ్రీవేంకటేశ్వరస్వామి రాతి విగ్రహం కింద పడి ఉండడాన్ని గుర్తించాడు. ఆ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకెళ్లడంతో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. 2009 డిసెంబర్ 28న శ్రీలక్ష్మీ నర్సింహస్వామి సుదర్శన హోమ కార్యక్రమాన్ని 50 మంది అహోబిల రామచంద్ర జీయర్‌స్వామి శిష్యులతో నిర్వహించారు. 2010 జనవరి 2న శ్రీత్రిదండి రామానుజన్ చినజీయర్‌స్వామి కొండను సందర్శించారు. దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కొండపై ఆధ్యాత్మిక, చారిత్రక ఆనవాళ్లు ఉండడంతో ఏటా శ్రావణం, కార్తీకమాసంలో భక్తులు దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దేవతా మూర్తులను దర్శించుకోవడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదదీరుతున్నారు. ఎత్తయిన కొండపై చూస్తే రామగుండం నగరం సుందరంగా కనిపిస్తుండడంతో తనివితీరా తిలకిస్తున్నారు.
ఆ పేరు ఎందుకు వచ్చిందంటే...
రాముడు–సీతాదేవి స్నానమాచరించిన రామునిగుండాలు ఉండడంతోనే రామగుండం పేరు వచ్చి నట్లు చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి బొగ్గు గనులు, రైల్వేస్టేషన్, కేశోరాం సిమెంట్ కర్మాగారం తదితర పరిశ్రమలన్నీ రామగుండం పేరిటనే కొనసాగుతుండడం గమనార్హం. వీటితోపాటు స్థానికంగా సహజ వనరుల లభ్యత కారణంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారుతోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కూడా రామగుండం పేరుకు సుస్థిర స్థానం లభించింది.
పర్యాటకంలో చేర్చాలి..
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలను గుర్తించి మరింత అభివృద్ధి చేసిఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను టూరిజం సర్క్యూట్ జాబితాలో చేర్చుతోంది. అదే జాబితాలో రామునిగుండాల కొండను చేర్చి, టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
రామగుండంలో వెలుగులోకి..
పరిశోధనలు చేస్తే మరింత సమాచారం
పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్న నగరవాసులు
Comments
Please login to add a commentAdd a comment