కన్నారం టు కాకినాడ
● పక్క రాష్ట్రంలో మన బియ్యం
● ఉమ్మడి కరీంనగర్‌వాసిపై కేసు
● పలువురు వ్యాపారుల పేర్లు తెరపైకి!
● దందాలో ఎలిగేడు మిల్లర్‌దే కీలక భూమిక?
● రేషన్ మాఫియా డాన్‌లకు అడ్డుకట్ట పడేనా.?
కరీంనగర్ అర్బన్: రేషన్ బియ్యం దందా జడలు విప్పుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో రాష్ట్రం దాటుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పోర్టు నుంచి భారీ ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఇటీవల అక్కడి అధికారులు గుర్తించారు. కాగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేషన్ బియ్యం ఉన్నట్లు తేలడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు స్టేషన్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. అయితే, అసలైన సూత్రధారులు ఈ కేసులో అనామక వ్యక్తినే బలి చేశారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, సిద్దిపేట జిల్లాలోని ఓ మిల్లుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయగా విచారణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు వ్యాపారుల పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఉమ్మడి జిల్లా నుంచి రేషన్ బియ్యం యథేచ్ఛగా తరలుతుంటే నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సంబంధిత అధికారుల డొల్లతనం బట్టబయలవుతోంది.
50 శాతానికి పైగా అక్రమార్కులకే..
జిల్లాలో ప్రతీ నెల 4,909 టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో 50 శాతానికి పైగా రేషన్ బియ్యం అక్రమార్కులకే చేరుతోంది. రేషన్ డీలర్లు దుకాణంలోనే కార్డుదారు వద్ద కొనుగోలు చేసి, అక్కడికక్కడే డబ్బులు చెల్లిస్తున్నారు. వీరు పోనూ కార్డుదారులు బియ్యం తీసుకెళ్లి, దళారులకు విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు చేరే బియ్యంలో 40 శాతం డీలర్ల వద్ద నుంచి, 60 శాతం పలువురు మిల్లర్లు, దళారుల నుంచి మాఫియాకు చేరుతోంది. ఆయా శాఖల అధికారులను మచ్చిక చేసుకొని, బియ్యం దందా సాగిస్తున్నారు. కిలోకు రూ.12 నుంచి రూ.14 వరకు వినియోగదారులకు చెల్లిస్తుండగా కమీషన్ రూపేణా పలువురు డీలర్లు, దళారులు రూ.5 నుంచి రూ.6 తీసుకుంటున్నారు. ఇతరత్రా ఖర్చులు కలిపి, మాఫియాకు, రైస్‌మిల్లులకు చేరేసరికి కిలోకు రూ.25 అవుతోంది. ఆ బియ్యాన్ని పాలిష్ చేసి, కొత్త సంచుల్లో నింపి, ఎగుమతి చేస్తున్నారు. సదరు బియ్యం కాకినాడ ఓడ రేపుకు చేరేసరికి క్వింటాల్‌కు రూ.3 వేల వరకు ఖర్చవుతుండగా.. అక్కడ రూ.3,500 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన ఒక ఏసీకే(290 క్వింటాళ్లు) కాకినాడ ఓడరేవులో విక్రయిస్తే రూ.1.50 లక్షలకు మించి గిట్టుబాటవుతోంది. దీంతో, ఈ దందాకే మాఫియా మొగ్గు చూపుతోంది. సంబంధిత శాఖల్లోని పలువురు అధికారులకు భారీగా గిఫ్ట్‌లు, ఆరంకెల్లో మామూళ్లు ఇస్తుండగా అక్రమ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగుతోందన్న ఆరోపణలున్నాయి.
తప్పించుకునేందుకు పైరవీలు..
అనువైన సమయంలో సీఎమ్మార్ లోటు ఉన్న మిల్లులకు రేషన్ బియ్యం చేర్చుతుండగా అనువు గాని సమయంలో పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని సమాచారం. పత్రికాధిపతులే తనకు మిత్రులని బీరాలు పలికే ఎలిగేడు మండలానికి చెందిన ఓ రైస్‌మిల్లర్ ఇందులో కీలక భూమిక పోషించినట్లు మిల్లర్ల నుంచి వినిపిస్తున్న మాట. సదరు మిల్లర్, పౌరసరఫరాల శాఖలోని ఓ అధికారి, సుల్తానాబాద్‌కు చెందిన మరో వ్యక్తి పెట్టుబడితోపాటు అక్రమ రవాణాలో సిద్ధహస్తులు. బియ్యం కొనుగోలు చేసే దళారులను పెంచి పోషించడం, రైస్‌మిల్లులను తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు వివిధ రకాల ఒత్తిడులు తెస్తారన్న ఆరోపణలున్నాయి. అధికారులతో దాడులు చేయించడం, బియ్యం కొనుగోలు చేస్తే తమ వద్దే కొనుగోలు చేయాలని హుకూం జారీ చేస్తున్నారని సమచారం. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఇదే విధానంతో సఫలీకృతులైనట్లు తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాల బడా వ్యాపారులతో సత్సంబంధాలుండటంతో దందా అప్రతిహతంగా సాగుతోందన్న విమర్శలున్నాయి. అయితే, కాకినాడ కేసులు తమ మెడకు చుట్టుకోకుండా వీలైనన్ని మార్గాల్లో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడి అధికార పార్టీ నేతలతోపాటు పక్క రాష్ట్రం అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపగా కేసుల నుంచి దాదాపు తప్పుంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment