జిల్లాలోని పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచండి
● మాతా శిశు మరణాలను నివారించాలి ● ఆరోగ్య మహిళపై విస్తృత అవగాహన కల్పించాలి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్యాధికారులు, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. మాతా శిశు మరణాలను నివారించాలని ఆదేశించారు. నెలాఖరులోగా తమకు నిర్దేశించిన ప్రసవాల లక్ష్యం చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్లు చేసిన ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. డెలివరీ సమయంలో మెడికల్ ఆఫీసర్ ఉన్నది లేనిది రికార్డు నమోదు చేయాలన్నారు.
ఆరోగ్య మహిళపై అవగాహన కల్పించాలి
ఆరోగ్య మహిళ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 13 ఏళ్లు దాటిన వారందరికీ ఆరు నెలలకోసారి అన్ని వైద్య పరీక్షలు చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా పరీక్షలు చేయించాలన్నారు. కేన్సర్‌ను మొదటిదశలో గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చన్నారు. శుక్రవారం సభకు మెడికల్ ఆఫీసర్లు విధిగా హాజరు కావాలన్నారు. తమ సెంటర్ పరిధిలో మందులు వృథా కాకుండా చూడాలన్నారు. ప్రతివారం సీడీపీవో, సూపర్ వైజర్, ఆశా వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు.
మాతా శిశు మరణాలు జరగకుండా చర్యలు
ఆస్పత్రుల్లో మాతా శిశు మరణాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సాయంతో గర్భిణులు ప్రతినెల పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. హైరిస్క్ కేసుల విషయంలో నిపుణులను సంప్రదించాలన్నారు. అనంతరం ఎండీఆర్, సీడీఆర్ కేసుల గురించి చర్చించారు. ఈ కేసులకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 29,712 మందికి ఆరోగ్య మహిళ కింద పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో వెంకటరమణ తెలిపారు. ఎంసీహెచ్ పీవో డాక్టర్ సనా, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందు, డీఐఓ సాజిదా, పీవో డీటీ టీ.ఉమశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment