ఉరిసిల్లగా మార్చొద్దు
● శాశ్వత ఉపాధి కల్పించాలి
● సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతకార్మికులు
సిరిసిల్లటౌన్: వస్త్రోత్పత్తి ఖిల్లాను మళ్లీ ఉరిసిల్లగా మార్చొద్దని రాష్ట్ర పవర్‌లూమ్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం పవర్‌లూమ్ వార్పిన్, వైపని అనుబంధ సంఘాలు, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గత, ప్రస్తుత ప్రభుత్వాల అసంబద్ధ విధానాలతోనే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్‌లూమ్ కార్మికులకు సరైన ఉపాధి లేకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఏడాదిగా పనిలేకుండా కార్మికులు ఎట్లా బతుకుతారనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. పని లేకనే చనిపోతున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాసినా.. జౌళిశాఖ అధికారులు మాత్రం నివేదిక విరుద్ధంగా తయారు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు యజమానులకు మేలు చేసేలా ఉన్నాయని, కార్మికులను ఆదుకునేలా లేవన్నారు. ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వస్త్రానికి కార్మికునికి రోజుకు రూ.వెయ్యి వేతనం వచ్చేలా కూలి నిర్ణయించాలని కోరారు. నాయకులు కోడం రమణ, అన్నల్‌దాస్ గణేశ్, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, రమేశ్‌చంద్ర, ఒగ్గు గణేశ్, మచ్చ వేణు, బూట్ల వెంకటేశం, బిజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment