భూముల అన్యాక్రాంతంపై సిట్ ఏర్పాటు చేయండి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను శనివారం పరిశీలించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారన్నారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి అనుచరులకు వేల ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలు చేశారని ఆరోపించారు. రైతుబంధు ద్వారా కోట్ల రూపాయలు అక్రమార్కులు పొందారన్నారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 365 బై నంబర్లలో డాకం సుడేష్ ఎకరం, బండి రమేష్ రెండెకరాలు, అబ్బాడి తిరుపతిరెడ్డి 20 గుంటలు, కోడూరి భాస్కర్ 20 గుంటలు, బండి ప్రసాద్ ఎకరం, బుస్స లింగం ఎకరం, చిలుముల వీరబ్రహ్మం ఎకరం చొప్పున లావని పట్టాలు పొందారని గ్రామస్తులు చాడ వెంకట్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. కేటీఆర్ హయాంలో పదేళ్లలో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, మండల కార్యదర్శి సోమ నాగరాజు, సిరిసిల్ల లింగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment