రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు
● వీసీలో బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, రోడ్డు భద్రత మాసోత్సవం విజయవంతంగా నిర్వహించాలని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో వీసీద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రమాణాల వేడుకలు ప్రతీగ్రామంలో జరగాలన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత ప్రతీ జిల్లా, మండలకేంద్రాల్లో భారీర్యాలీలు నిర్వహించాలన్నారు. ఇతర కారణాలతో పోలిస్తే.. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారని.. ప్రమాదాల నియంత్రణకు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్‌వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 75శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ తప్పులతో జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. జిల్లాలో 82బ్లాక్‌స్పాట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 68 బ్లాక్‌స్పాట్లు సరి చేశామని తెలిపారు. మిగిలినవి మరమ్మతు చేస్తామని వివరించారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఇన్‌చార్జి డీఆర్‌వో పవన్ కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్, ఆర్టీసీ ఆర్‌ఎం పి.రాజు, డీఈవో జనార్దన్‌రావు, డిప్యూటీ రవాణా అధికారి పి.పురుషోత్తం, ఎస్‌ఈ బి.లక్ష్మణ్, డీసీఓలు పి.సరిత, జగన్నాథం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment