రైలు పట్టాలకు మరమ్మతు
ఓదెల(పెద్దపల్లి): కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్య రైలు ప్రమాదాల నియంత్రణ కోసం ఆ శాఖ పట్టాల మరమ్మతుకు శ్రీకారం చుట్టింది. ఉదయం చలి, మధ్యాహ్నం వేడి తీవ్రతతో పట్టాలు సంకోచ, వ్యాకోచాలకు గురవుతాయని, ఈ సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. మేరకు జిల్లాలోని బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, పెద్దపల్లి, రాఘవాపూర్, పెద్దంపేటతోపాటు మంచిర్యాల జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి మధ్య రైలు పట్టాలకు కూలీలతో మరమ్మతు చేయిస్తున్నారు. పట్టాల కింద ఉన్న పనికిరాని సిమెంట్ స్లీపర్లను తొలగించి కొత్తవి వేస్తున్నారు. రెండు వైపులా పట్టాలు సమాంతరంగా ఉన్నాయా లేదా అనే విషయాలపై ఇంజినీర్లు ఆరా తీస్తున్నారు. కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్య మూడోలైన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రద్దీ అధికమైంది. ఫలితంగా రైల్వేశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణ, మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధత తీసుకుంటున్నారు. రైల్వేస్టేషన్ల పరిసరాలతోపాటు సమీపంలోనూ మరమ్మతు చేస్తున్నారు. దీనిద్వారా గూడ్సురైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. మరికొని రైళ్ల వేగం తగ్గించాల్సింగా రైలు పట్టాల వెంట బోర్డులను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment