ఆర్థిక, సైబర్ నేరాలపై దృష్టిసారించాలి
● సీపీ అభిషేక్ మహంతి
కరీంనగర్ క్రైం: ఆర్థిక, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ అభిషేక్ మహంతి అన్నారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కమిషనరేట్‌లోని అస్త్ర కన్వెన్షన్ హాల్లో కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో 2025 అర్ధవార్షిక సంవత్సర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్ పోలీసింగ్‌తోపాటు కొన్ని అంశాలపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్‌కు మరింత ప్రాముఖ్యత పెంచడంతోపాటు అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రౌడీ షీటర్లు, వీధి రౌడీలుగా చలామణి అయ్యేవారిపై నిఘా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని చెప్పారు. గంజాయితో పట్టుపడితే కేసు వీగిపోకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని, కమిషనరేట్ వ్యాప్తంగా పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కమిషనరేట్ వ్యాప్తంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
పనులు నాణ్యతతో పూర్తి చేయాలి
● సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్‌సిటీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని మల్టీపర్పస్ పార్క్‌ను సందర్శించి, ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సుమారు రూ.11 కోట్లతో పార్క్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఎవరి ఒత్తిడి ఉన్నా నాణ్యతాప్రమాణా లు పాటించాలని ఆదేశించారు. హంపి థియేటర్ వెనకాల వారసత్వ కట్టడమైన మల్టీపర్పస్ పాఠశాల భవనం దెబ్బతిందని, మరమ్మతు చేయాల్సి ఉందన్నారు. కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, కోటగిరి భూమాగౌడ్, సరిళ్ల ప్రసాద్, నాయకులు మెండి చంద్రశేఖర్, కాశెట్టి శ్రీనివాస్, ఎండీ.తాజ్, అర్ష మల్లేశం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, పోచయ్య, దన్న సింగ్, జక్కుల మల్లేశం, జీడి రమేశ్, మీరాజ్, బషీర్, సుదర్శన్, ఎల్లారెడ్డి, నగరపాలక సంస్థ ఈఈ యాదగిరి పాల్గొన్నారు.
త్వరితగతిన వ్యవసాయ సర్వీసు కనెక్షన్లు
● కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రమేశ్‌బాబు
కొత్తపల్లి(కరీంనగర్): రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక కార్యాచరణ అవలంబిస్తూ యుద్ధప్రాతిపదికన వ్యవసాయ సర్వీసు కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 1,204 సర్వీసులు మంజూరు చేశామని పేర్కొన్నారు. 2023తో పోల్చుకుంటే దాదాపు 30 శాతం సర్వీసులు పెరిగాయన్నారు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్ చేయ డం ద్వారా ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరి శీలించి, త్వరితగతిన మంజూరు ఇస్తున్నట్లు తె లిపారు. రైతులకు మరింత చేరువై, వారి సమస్యలను పరిష్కరించేందుకు పొలంబాట కార్యక్రమాన్ని సైతం చేపట్టామని పేర్కొన్నారు.
ఉస్మానియా వర్సిటీ క్రికెట్ టీంలో చోటు
కరీంనగర్ స్పోర్ట్స్: క్రికెట్ అండర్–14, 16 కరీంనగర్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించి, ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న జిల్లాకు చెందిన డి.సాత్విక్ ఉస్మానియా యూనివర్సిటీ జట్టులో చోటు సంపాదించాడు. బుధవారం ప్రకటించిన జాబితాలో ఇతని పేరు కూడా ఉంది. ఈ నెల 16 నుంచి 21 వరకు చైన్నెలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ క్రికెట్ పోటీల్లో పాల్గొననున్నాడు. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి 2డే, 3డే మ్యాచ్‌లలో ఆడిన సాత్విక్ ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో సైతం రెండుసార్లు పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment