జానపద కళలను ప్రోత్సహించాలి
కరీంనగర్‌కల్చరల్/విద్యానగర్: జానపద కళలను ప్రోత్సహించాలని, ఇందుకోసం యువత ముందుకు రావాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని కళాభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 41వ వార్షికోత్సవంలో భాగంగా గ్రామీణ కళాజ్యోతి అవార్డులను ప్రదానం చేసి, మాట్లాడారు. కళాకారులు తమకున్న అనుభవంతో భవిష్యత్తు తరాలకు కళలను నేర్పించాలని సూచించారు. విద్యార్థులు జానపద కళలను వీక్షించేలా చూడాలన్నారు. మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ.. జానపదం జీవించి ఉండాలంటే కొత్త తరం రావాలని ఆకాంక్షించారు. మిద్దె రాములు వంటి కళాకారులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచేది కళాకారులేనన్నారు. వారికి పింఛన్, ఇందిరమ్మ ఇళ్లలో ప్రాముఖ్యం ఇస్తున్నామని తెలిపారు. అనంతరం జానపద వృత్తిలో రాణించిన వారికి కళాజ్యోతి జీవిత సౌఫల్య, యువ, బాల పురస్కారాలు ప్రదానం చేశారు. పలు ప్రాంతాల నుంచి హాజరైన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ నాటక సమాఖ్య అధ్యక్షుడు సదానందం, తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు కృపాదానం, తాడూరి కరుణాకర్, వంగ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రక్తదానం..
ఆర్టీసీ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ బస్‌స్టేషన్ ప్రాంగణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దీన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఆమెతోపాటు ఆర్టీసీ అధికారులు తదితరులు 138 మంది రక్తదానం చేశారు. ట్రెయినీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పి.పురుషోత్తం, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్, రీజినల్ మేనేజర్ రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్(మెకానికల్) సత్యనారాయణ, డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) భూపతిరెడ్డి, కరీంనగర్–1, 2 డిపోల మేనేజర్లు విజయమాధురి, మల్లయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ బ్రాంచి చైర్మన్ పెండ్యాల కేశవరావు, సెక్రటరీ ఊటూరి రాధాకృష్ణారెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి
Comments
Please login to add a commentAdd a comment