డీ–4 కాలువకు గండి
● జలమయమైన మన్నెంపల్లి ● ఇళ్లలోకి చేరిన వరద ● గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి ● బాధితులకు పరిహారం, సరుకుల అందజేతకు హామీ
తిమ్మాపూర్: తోటపల్లి రిజర్వాయర్ లింక్ డీ–4 కాలువకు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద ఆదివారం ఉదయం గండిపడింది. నీరంతా గ్రామాన్ని ముంచెత్తింది. పలు ఇళ్లలోకి నీరుచేరి, వస్తువులు, పండుగ సరుకులు తడిసిపోయాయి. డీ–4 కెనాల్ ద్వారా చిగురుమామిడి, తిమ్మాపూర్, మానకొండూర్ మండలంలోని కొన్ని గ్రామాల్లో సాగునీరు అందుతోంది. చిగురుమామిడి మండలం పిచుపల్లి లింకు వద్ద శనివారం రాత్రి నీటి విడుదల చేశారు. సైదాపూర్ మండల పరిధిలోని రైతులు షట్టర్లు మూసివేశారు. దీంతో మన్నెంపల్లి వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా కావడంతో కాలువకు గండి పడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే గ్రామానికి చేరుకున్నారు. గండిని పరిశీలించి, కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాలువకు గండి వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితులకు పరిహారంతోపాటు నిత్యవసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణగౌడ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, తూముల శ్రీనివాస్, పోతుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘పొంగులేటి’ బాధ్యత వహించాలి
పండుగ పూట మన్నెంపల్లి ప్రజలు వరద నీటిలో పస్తులుండే పరిస్థితి వచ్చిందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. డీ–4 కాలువకు గండి పడిన ఘటనపై ఆయన స్పందించారు. కాళేశ్వరం పనికి రాదన్న పొంగులేటి దీనికి బాధ్యత వహించాలన్నారు. పొంగులేటి సొంత కంపెనీ అయిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ద్వారానే ఈ కాల్వ నిర్మాణం జరిగిందన్నారు. పంటలు మునిగి, ఇళ్లలో సామగ్రి తడిసిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment