డూడూ.. బసవన్న
ఉమ్మడి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్దేవుపల్లిలో గంగిరెద్దుల కుటుంబాలవారు చాలాకాలంగా జీవనం సాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు. గంగిరెద్దులతో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, మంథని, జమ్మికుంట, హుజూరాబాద్, కరీంనగర్, చొప్పదండి ధర్మారం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తూ భిక్షాటన చేస్తూ ఉపాధి పొందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 400 గంగిరెద్దులవారి కుటుంబాలు ఉన్నాయి. కోనరావుపేట మండలం కొండాపూర్‌లో వంద, బావుసాయిపేటలో సుమారు 70, మరిమడ్లలో 30 చందుర్తి మండలం సనుగుల, జోగాపూర్ గ్రామాల్లో కలిపి రెండు వందల కుటుంబాలు నివాసముంటున్నాయి. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పరిధిలో ఒకే ఊరే వీరికోసం ఉంది. జగిత్యాల జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లోనూ గంగిరెద్దులవారు ఉపాధి పొందుతున్నారు.
కోల్‌సిటీ(రామగుండం)/విద్యానగర్(కరీంనగర్): ‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మవారి ముందు డాన్స్‌చెయ్.. చిన్న దొరను సంబరపెట్టు’.. అంటూ సంక్రాంతి వేళ గంగిరెద్దుల వాళ్లు ఊరూవాడా సందడి చేస్తున్నారు. కనుమరుగయ్యే దశలో ఉన్న కళను గంగిరెద్దుల వాళ్లు భుక్తి కోసం స్వస్థలాలు వదిలి ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తూ యాచిస్తున్నారు. గంగిరెద్దు వాకిట్లోకి వస్తే శుభం జరుగుతుందని నమ్మకం. ఈ సాంప్రదాయాలను గంగిరెద్దులవారు కాపాడుతున్నారు. కంప్యూటర్ యుగంలోనూ డూడూ బసవన్నల విన్యాసాలతో సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తున్నారు.
విచిత్ర జీవనశైలి
గంగిరెద్దులవారి జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. మగవాళ్లు బసన్నవలతో విన్యాసాలు చేస్తూ భిక్షాటనకు వెళ్తారు. తాత ముత్తాల నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తున్న ఈ నిరుపేదలు సాంప్రదాయాన్ని బతికిస్తూ వ స్తున్నారు. నెత్తిన రంగుల తలపాడ, మూతిమీద కోరమీసాలు, చెవులకు కమ్మల జోడు, నల్లని సూటు, రంగురంగుల దుస్తులు, భుజంపై రంగుల కండువాలు, చేతికి వెండి కడెంలు ధరించి... బూర, డోలు, చేతిలో కంచుతో చేసిన చిన్న చేగుంట, పీకతో వినూత్న ఆకర్షణగా ఉంటారు. గంగిరెద్దులను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు. సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి వాడల్లో ప్రత్యక్షమవుతారు. గంగిరెద్దులతో విన్యాసాలు చేయిస్తారు. ఎద్దు నోటితో తమ మెడను కొరినట్లు గావు పట్టడం. ఎద్దు నాలుగుకాళ్లతో మనిషిపై నిలబడి విన్యాసాలు చేయిస్తారు. కూర్చొమంటే కూర్చోవడం, తల ఊపమంటే ఊపడం, మంచి జరుగుతుందా అని అడిగితే తల ఊపడం, దండం పెట్టమంటే రెండు కాళ్లపై కూర్చొని తల ఊపడం లాంటి విన్యాస్యాలు చేయిస్తుంటారు. గంగిరెద్దులతోపాటు వారితో ఉండే మేకలు, గొర్రెలతోనూ విన్యాసాలు చేయిస్తారు.
గంగిరెద్దులతోనే సంక్రాంతి కళ పండక్కి ముందు నుంచే సందడి సంస్కృతిని కాపాడుతున్న గంగిరెద్దులోళ్లు
Comments
Please login to add a commentAdd a comment