మార్కెట్ స్టాళ్ల కేటాయింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని పద్మనగర్ సమీకృత మార్కెట్ స్టాళ్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. మార్కెట్‌లోని 193 స్టాళ్లను ఐదేళ్ల లీజుపై అప్పగించేందుకు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించడం తెలిసిందే. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సోమవారం నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. కళాభారతిలో దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించిన ఈ లక్కీ డ్రాకు హాజరైన మేయర్ యాదగిరి సునీల్‌రావు పర్యవేక్షించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా పద్మనగర్‌లో నిర్మించిన వెజ్, నాన్‌వెజ్ సమీకృత మార్కెట్‌లో మొత్తం 193 స్టాళ్లున్నాయి. ఈ స్టాళ్లకు గాను 313 దరఖాస్తులు రాగా, రిజర్వేషన్‌లు, కేటగిరీల వారిగా లక్కీ డ్రా తీసి స్టాళ్లను కేటాయించారు. లక్కీ డ్రాలో 121 కూరగాయలు, 12 పండ్లు, 12 పూలు, 26 మాంసం స్టాళ్లతో పాటు 22 షటర్లను వివిధ కేటగిరీల వారీగా వ్యాపారులకు కేటాయించారు.
గంపగుత్త దరఖాస్తులతో గందరగోళం
లక్కీ డ్రాలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మార్కెట్‌లో వేర్వేరు కేటగిరీలైన వెజ్, నాన్‌వెజ్, పూలు, పండ్లు, షట్టర్లకు కలిపి దరఖాస్తులు తీసుకోవడం సమస్యగా మారింది. కేటగి రీల వారిగా రిజర్వేషన్‌ను పాటిస్తూ, లక్కీ డ్రా తీయాల్సి ఉండడంతో, ఎవరు ఏ కేటగిరికి దరఖాస్తు చేసారో అనేది తెలియకుండా పోయింది. కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ స్వయంగా దరఖాస్తుదారులను పిలుస్తూ ఏ కేటగిరీ కావాలనుకుంటున్నారో తెలుసుకొని జాబి తా సిద్ధం చేయాల్సి వచ్చింది. దరఖాస్తు చేసుకున్నప్పటికీ జాబితాలో పేర్లు లేకుండా పోయాయని, అలాంటి వారిని కూడా కలిపి డ్రా తీయాలని 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కమిషనర్‌ను కోరారు. దరఖాస్తుదారులు డీడీలు చూపిస్తే, జాబితాలో చేరుస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
23న స్టాళ్లు అప్పగింత
23వ తేదీన మార్కెట్‌ను ప్రారంభిస్తున్నామని, అదేరోజు వ్యాపారులకు స్టాళ్లు అప్పగిస్తామని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు. స్టాళ్లు పొందిన వ్యాపారులు మూడు నెలలు అడ్వాన్స్ చెల్లించి, ఐదు సంవత్సరాల ఒప్పందం చేసుకోవాలన్నారు. సబ్‌లీజుకు ఇచ్చినట్లుగా తేలితే ఆ స్టాల్ కేటాయింపు రద్దు చేస్తామన్నారు. డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్‌వో సునీల్, ఆర్‌ఐ శ్యాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment