పాఠశాల నుంచి వస్తూ మృత్యుఒడికి
● వాహన డోర్ తెరుచుకోవడంతో కిందపడి చిన్నారి మృతి
● గుంజపడుగులో విషాదం
గొల్లపల్లి(ధర్మపురి): ఆ చిన్నారి ఉదయం పాఠశాలకు వెళ్లింది.. సాయంత్రం ఆనందంగా ఇంటికి బయలుదేరింది.. మార్గమధ్యలో వాహన డోర్ తెరుచుకోవడంతో కిందపడి, మృతిచెందింది. ఈ ఘటన గొల్లపల్లి మండలంలోని గుంజపడుగు గ్రామంలో విషాదం నింపింది. ఎస్సై సతీశ్ వివరాల ప్రకారం.. గుంజపడుగుకు చెందిన పురాణం దేవ–లత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం. కూతుళ్లను చిల్వాకోడూర్ ప్రాథమిక పాఠశాలలో చదివిస్తున్నారు. శనివారం పాఠశాల సమయం ముగియడంతో తోటి విద్యార్థులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు టాటామ్యాజిక్ వాహనం ఎక్కారు. గోవిందుపల్లి వద్దకు రాగానే వాహనం సైడ్ డోర్ తెరుచుకోవడంతో రెండో కూతురు స్పందన ప్రమాదవశాత్తు కిందపడి, తీవ్రంగా గాయపడింది. స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న పాపను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. చిన్నారి మృతదేహాన్ని పట్టుకొని లే తల్లీ లేరా.. మీ కోసమే కష్ట పడుతున్నాం.. వదిలేసి పోతే తాము బతికేదెలా తల్లీ.. అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment