రూ.8లక్షలతో బంగారం వ్యాపారి పరార్?
గోదావరిఖని: నగరంలోని ఓ ప్రముఖ బంగారం వ్యాపారి పరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. వారం రోజులుగా షాపు మూసిఉంది. దీంతోపాటు బోర్డు తొలగిస్తున్నారే సమాచారం తెలిసిన బాధితులు.. గురువారం షాపు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. బంగారం ఇస్తానని డబ్బులు తీసుకోవడం, బంగారం తాకట్టు పెట్టి అప్పులు ఇవ్వడం, ఆభరణాలు తయారు చేసి ఇస్తామని సదరు వ్యాపారి డబ్బులు తీసుకున్నాడని బాధితులు పేర్కొంటున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర నుంచి నగల తయారీ కోసం ఈ వ్యాపారి గోదావరిఖని వచ్చాడు. కొన్నేళ్లలోనే రూ.కోట్లు కూడబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కస్టమర్లతో నమ్మకంగా ఉంటూ నగలను సకాలంలో తయారు చేసి ఇవ్వడంతో చాలామంది అప్పుగా డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవల చాలా మంది ఆభరణాల కోసం డబ్బులిచ్చినట్లు పేర్కొంటున్నారు. షాప్‌ఉన్న బిల్డింగ్‌ను కూడా అమ్ముకుని వ్యాపారి పరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. వన్‌టౌన్ సీఐ రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. కూతురు పెళ్లి నగల కోసం తాను రూ.15లక్షలను వ్యాపారికి ఇచ్చి మోసపోయినట్లు ఓ బాధితుడు వాపోయాడు. చివరి నిమిషంలో మోసం చేయడంతో కూతురు పెళ్లి ఎలా చేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే, బంగారం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేసేందుకు బాధితులు కొందరు పోలీస్‌స్టేషన్ వచ్చారని సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తమకు ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
లబోదిబోమంటున్న బాధితులు
Comments
Please login to add a commentAdd a comment