తుంగభద్ర ఆయకట్టు పరిధిలో పచ్చదనంతో కళకళలాడుతున్న వరి పైరు
సాక్షి,బళ్లారి: రబీ సీజన్‌లో తుంగభద్ర ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వరి పంట ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడుతోంది. దీంతో రైతన్నల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి మంచి వర్షాలు కురవడంతో ఖరీఫ్ పంటను సకాలంలో పూర్తి చేసుకుని, రబీలో కూడా వరి పంటను అదునులోగా నాట్లు వేయడంతో ప్రస్తుతం తుంగభద్ర ఆయకట్టు కింద వరి పైరు గింజ కట్టే దశకు చేరుకుంటోంది. ఆయకట్టు పరిధిలోని విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో రబీలో డ్యాం నుంచి ఆయకట్టుకు నీరందించే భూముల్లో ఎక్కడ చూసినా పచ్చదనం అల్లుకుంది. బళ్లారి జిల్లాలోని ఎల్‌ఎల్‌సీ కింద కంప్లి, కురుగోడు, సిరుగుప్ప తాలూకాల్లో, కొప్పళ జిల్లాలోని గంగావతి నుంచి అంజనాద్రి కొండకు వెళ్లే రహదారి పొడవునా వరి పైరు చూడముచ్చటగా ఉంది.
లాభాల బాటలో వరి రైతులు
పచ్చని వరిపైరు పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు అంతో ఇంతో లాభాలు గడించి చేసిన అప్పులను కొంతైనా తీర్చుతూ, రబీలో కూడా ఉత్సాహంగా వరినాట్లు వేయడంతో ప్రస్తుతం గింజ దశకు చేరిన రబీ వరి రబీ పంటపై రైతుల్లో కూడా ఆశలు చిగురిస్తున్నాయి. రబీలో కూడా పెట్టుబడులు పోను ఒక ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేసుకుంటున్నారు. కౌలు రైతులకు కూడా వరి పంట గిట్టుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.తుంగభద్ర డ్యాంలో రబీ పంటకు తగినంత నీరు కూడా ఉన్నందున పంటకు ఎలాంటి ఢోకా ఉండబోదని సమాచారం. అయితే నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పచ్చదనంతో అలరారుతున్న పైరు
రెండో పంటకు సాగునీటి ఢోకా లేనట్లే
Comments
Please login to add a commentAdd a comment